Delhi Ordinance Bill:
గందరగోళం..
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్‌పై పార్లమెంట్‌లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే మణిపూర్ అంశంపై మాట్లాడాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తుండటం వల్ల రెండు సభలూ సజావుగా సాగడం లేదు. వరుసగా వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్ వివాదానికి కారణమైంది. ఇవాళ (ఆగస్టు 2) లోక్‌సభలో ఈ బిల్‌ని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఢిల్లీలోని పాలనా వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వానికే అధికారాలు ఉండేలా రూపొందించిన ఈ బిల్‌ని ఆప్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఆమోదించకుండా అడ్డుకుంటామని స్పష్టం చేసింది. ఇందుకోసం మిగతా పార్టీల మద్దతునీ కూడగడుతోంది. కేంద్రహోం మంత్రి అమిత్‌షా ఈ బిల్‌ని ప్రవేశపెట్టిన తరవాత డిప్యుటీ హోం మంత్రి నిత్యానంద్ రాయ్...అందులోని అంశాలను పార్లమెంట్‌కి వెల్లడిస్తారు. ఇప్పటికిప్పుడు ఈ ఆర్డినెన్స్‌ని ఎందుకు తీసుకొస్తున్నారో అన్నది వివరించనున్నట్టు తెలుస్తోంది. అయితే...అటు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. ఆప్‌కి అండగా కాంగ్రెస్ నిలబడుతోంది.
YSRCPమద్దతు
అటు కేంద్రానికి మద్దతుగా బీజేడీతో పాటు YSRCP కూడా మద్దతు పలుకుతోంది. ఈ బిల్‌కి పూర్తి మద్దతునిచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇదే ఇప్పుడు రాజకీయంగా చిచ్చు పెట్టింది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే INDIA కూటమి నేతలు సమావేశమయ్యారు. ఆ సమయంలోనే ఈ బిల్‌కి మద్దతునిచ్చే పార్టీలపై విమర్శలు చేశారు. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతా దళ్ ( Biju Janata Dal)పై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా విరుచుకు పడ్డారు. ఈ బిల్‌కి మద్దతు తెలిపే వాళ్లను తాము యాంటీ నేషనల్ పార్టీగా చూస్తామని ఘాటుగా స్పందించారు. దీనిపై ఇంత గొడవ జరుగుతున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా సపోర్ట్ ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. అసలు ఈ పార్టీలు ఎందుకు మద్దతునిస్తున్నాయో అర్థం కావడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబర్ అసహనం వ్యక్తం చేశారు.
"బీజేపీ ఎంపీలు ఈ బిల్‌కి ఎందుకు మద్దతునిస్తున్నారో అర్థం కావడం లేదు. అంత గొప్పదనం అందులో ఏం కనిపించిందో కూడా తెలియడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రిపైనా కేంద్రానికి అధికారం ఉండేలా రూపొందించిన ఈ బిల్‌లో ఒడిశా,ఏపీ ప్రభుత్వాలకు ఏం మెరిట్ కనిపించింది..? లెఫ్ట్‌నెంట్ గవర్నర్ చెప్పిందే వేదం అని పాటించాలనడంలో అర్థం ఏంటి..?"
- పి. చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత