Parliament Monsoon Session |  పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 న ప్రారంభం కానున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. ఆగస్టు 12 వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయని తెలిపారు. మూడు నెలలకు పైగా విరామం తర్వాత జూలై 21న ఉదయం 11 గంటలకు పార్లమెంటు ఉభయ సభలు సమావేశం కానున్నాయి.

ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ పై ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రతిపక్షాలు గత కొన్ని రోజుల నుంచి డిమాండ్ చేస్తున్న సమయంలో కేంద్రం పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీని ప్రకటించడం గమనార్హం. ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంట్ సంయుక్త సమావేశం నిర్వహించని కారణంగా.. కాంగ్రెస్ నేతలు మల్లిఖార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ కేంద్రం తీరును తప్పుపట్టారు. ఆపరేషన్ సిందూర్ లో కూలిన ఫైటర్ జెట్లు, రాఫెల్ విమానాలు ఎన్నో ప్రజలకు లెక్క చెప్పాలంటూ సైతం విపక్షాలు తీవ్ర వ్యాఖ్యలు చేసినా కేంద్రం వాటిని పట్టించుకోలేదు.

పహల్గాం ఉగ్రదాడి తరువాత అఖిలపక్ష సమావేశం నిర్వహించగా ప్రధాని మోదీ హాజరుకాలేదు. దాంతో కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వం తీరును తప్పుపట్టారు. ఇలాంటి సమయంలో దేశం మొత్తం ప్రభుత్వానికి మద్దతు తెలుపుతుంటే వారు మాత్రం, తమతో ఎలాంటి చర్చలు జరపలేదని మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. తరువాత ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత బలగాలు విరుచుకుపడి ధ్వంసం చేశాయి. అనంతరం సెంట్రల్ కేబినెట్ కమిటీ భేటీ అయింది. తరువాత విపక్షాలతో కేంద్ర మంత్రులు, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సమావేమై ఆపరేషన్ సిందూర్ గురించి వారికి వివరించారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, ఉగ్రవాదులను ఏరివేయడమై తమ లక్ష్యం అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.