Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఒక్కరోజు ముందు ఆదివారం నాడు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం (All Party Meet) ఏర్పాటు చేసింది. కానీ ఈ అఖిలపక్ష సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గైర్హాజరయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ పదవీ కాలం జూలై 24న ముగియనున్నందున ప్రధాని మోదీ హాజరవుతారని ఆశించిన విపక్షాలకు నిరాశే ఎందురైంది.
దేశంలో ప్రస్తుతం సమస్యాత్మకంగా మారుతున్న ఆర్మీ రిక్రూట్ మెంట్ అగ్నిపథ్ పథకంతో పాటు నాలుగు దశాబ్దాల గరిష్టానికి పెరిగిన నిరుద్యోగం, ఇతరత్రా కీలక సమస్యలపై చర్చలు జరపాలని కేంద్రాన్ని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇంతకుముందు లాగే ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరు అయ్యారని, ఇది అన్ పార్లమెంటరీ అని జైరాం రామేష్ ప్రశ్నించారు. ఇతర విపక్ష నేతలు సైతం ఈ భేటీకి ప్రధాని గైర్హాజరు కావడాన్ని తప్పుపట్టారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం పద్ధతి కాదంటూ మండిపడ్డారు.
హాజరైన నేతలు వీరే..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చర్చించే అంశాల అజెండాను అందరి ముందు ఉంచి, అన్ని పార్టీల నేతలను ఏకాభిప్రాయానికి తేవడంలో భాగంగా ప్రభుత్వాలు అఖిలపక్ష భేటీని నిర్వహిస్తుంటాయి. అయితే సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, జయరాం రమేశ్, అధీర్ రంజన్ చౌధరిలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, అన్నాడీఎంకే ఎంపీ డాక్టర్ ఎం తంబిదురై, టీఎంసీ ఎంపీ సుదిప్ బందోపాధ్యాయ, అప్నాదల్ ఎంపీ అనుప్రియా పటేల్, టీఆర్ఎస్ నుంచి కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావు, ఆర్‌జేడీ నుంచి ఏడీ సింగ్, శివసేన నుంచి సంజయ్ రౌత్, బీజేడీ నుంచి పినాకి మిశ్రా, డీఎంకే నుంచి ఎంపీలు టీఆర్ బాలు, తిరుచి శివ, ఎన్‌సీపీ నుంచి శరద్ పవార్ పాల్గొన్నారు. అఖిలపక్ష భేటీకి హాజరైన వారిలో ఉన్నారు.
లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న ద ఇండియన్ అంటార్కిటికా బిల్లు 2022, లోక్ సభలో ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్ లో ఉన్న అంతర్రాష్ట్రాల జలవివాదాల బిల్లు 2019 పై ఈ సమావేశాలలో చర్చ జరగనుంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సవరణ బిల్లు 2022 రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందనున్నారు. యాంటీ మారిటైమ్ పైరసీ బిల్లు 2019, నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు 2021 లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటు సెంట్రల్ యూనివర్సిటీస్ సవరణల బిల్లు 2022, ఫ్యామిలీ కోర్టుల సవరణ బిల్లు 2022, ఎస్టీలకు సంబంధించి సవరణ బిల్లు 2022 లాంటి కొత్త బిల్లులు ఈ సారి సభలో ప్రవేశపెట్టనున్నారు.
పార్లమెంట్ వర్షాల కాల సమావేశాలు జూలై 18న ప్రారంభమై ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. అయితే సమావేశాల తొలిరోజు రాష్ట్రపతి ఎన్నిక ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 21న నిర్వహిస్తారు. జూలై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.