Fact Check: భారత్ సైనిక స్థావరాలపై నిరంతరం దాడులు చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నించి విఫలమవుతున్న పాకిస్థాన్ మరిన్ని కుయుక్తులకు తెర తీస్తోంది. భారత్ ప్రజల్లో అలజడి రేపేందుకు సోషల్ మీడియాను, ఆ దేశ మీడియాను వాడుకుంటోంది. భారత్‌లో దాడులు జరిగిపోయాయని తప్పుడు ప్రచారం చేస్తోంది. దీన్ని కేంద్రంతోపాటు, భారత్‌కు చెందిన నెటిజన్లు దీటుగా ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమాచారాన్ని నమ్మొద్దని కేంద్ర సమాచార శాఖ చెబుతోంది. తప్పుడు సమాచారన్ని వ్యాప్తి చేసిన వాళ్లు కూడా శిక్షార్హులు అవుతారని హెచ్చరించింది.
భారతీయ ప్రజల్లో భయాన్ని కలిగించాలనే ఏకైక లక్ష్యంతో, కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్, ముఖ్యంగా పాకిస్తాన్‌లోని మీడియా సమన్వయంతో తప్పుడు సమాచారంతో దాడి చేస్తోంది దాయాది దేశం. ఈ మానసిక యుద్ధాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. అయినా పాకిస్థానా దురాగతాలు ఆగడం లేదు. దీన్ని నిజం అనుకొని కొందరు వాటిని షేర్ చేస్తున్నారు. దీనిపై కూడా పీఐబీ హెచ్చరికలుజారీ చేసింది. PIB ఫ్యాక్ట్ చెక్ పేరుతో నిరంతరం తప్పుడు సమాచారాన్ని తిప్పికొడుతోంది.
మే 08, 2025న రాత్రి పది గంటల నుంచి ఈ ఉదయం ఆరు గంటల మధ్య మొత్తం ఏడు వీడియోలకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. వాస్తవం లేదని స్పష్టం చేసింది.
1. జలంధర్‌లో జరిగిన డ్రోన్ దాడికి సంబంధించిన వీడియోను ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు పాక్ ప్రేరేపిత నెటిజన్లు. PIB వీడియోను పరిశీలించగా, అది వ్యవసాయ అగ్నిప్రమాదానికి సంబంధించింది. అసలు ప్రస్తుతం జరుగుతున్న ఉద్రిక్తత పరిస్థితులకు సంబంధం లేనిదిగా తేలింది. ఈ వీడియోను రాత్రి 7:39 గంటలకు టైమ్‌లైన్‌లో ఉంది.
2. పాకిస్తాన్ సైన్యం ఒక భారతీయ పోస్ట్‌ను ధ్వంసం చేసిందని ఆన్‌లైన్‌లో వైరల్ అవుతన్న వీడియో ఫేక్ అని పీఐబీ తేల్చింది. పాకిస్థాన్‌లో పుట్టిన అనేక సోషల్ మీడియా ఖాతాల నుంచి షేర్ అయింది. ఇది పూర్తిగా అబద్ధమని PIB రీసెర్చ్‌లో తేలింది. భారత సైన్యంలో “20 రాజ్ బెటాలియన్” అనే యూనిట్ లేదని అందుకే ఇది నకిలీదని నిర్ధారించింది. ప్రజలను తప్పుదారి పట్టించడానికి చేస్తున్న కుట్రగా ఈ వీడియోను అభివర్ణించింది.
3. పాకిస్తాన్ ప్రతీకారంగా భారతదేశంపై క్షిపణి దాడి చేసిందనే ఓ పాత వీడియో షేర్ చేస్తున్నారు కొందరు పాకిస్థాన్ నెటిజన్లు. PIB వీడియోను నిజనిర్ధారణ తనిఖీ చేసిన తర్వాత తప్పుడు సమాచారాన్ని గుర్తించింది. షేర్ చేసిన వీడియో వాస్తవానికి 2020 సంవత్సరంలో లెబనాన్‌లోని బీరుట్‌లో జరిగిన దాడికి సంబంధించినది. ఆ లింక్‌ను ఇక్కడ చూడొచ్చు.
4. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరిలో ఆర్మీ బ్రిగేడ్‌పై జరిగిన ఫిదాయీన్ దాడికి సంబంధించిన సమాచారంగా మరో వీడియో విస్తృతంగా షేర్ అవుతోంది. ఫ్యాక్ట్ చెక్ తర్వాత ఏ ఆర్మీ కంటోన్మెంట్‌లోనూ అలాంటి ఫిదాయీన్ లేదా ఆత్మాహుతి దాడి జరగలేదని PIB నిర్ధారించింది. తప్పుడు ప్రచారంతో గందరగోళం కలిగించడానికి ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నట్టు తేలింది.
5. సైనిక సిబ్బంది (CoAS) చీఫ్ జనరల్ V.K. నారాయణ్, నార్తర్న్ కమాండ్ ఆర్మీ అధికారికి సైనిక సంసిద్ధతకు సంబంధించి ఒక రహస్య లేఖను పంపారని మరో దుష్ప్రచారం సాగుతోంది. దానిని PIB వాస్తవ తనిఖీ చేస్తే జనరల్ V.K. నారాయణ్ CoAS కాదని తేలింది.ఆ లేఖ పూర్తిగా నకిలీదని నిర్దారణైంది.
6. భారత సైన్యం అమృత్‌సర్‌పై, దాని స్వంత పౌరులపై దాడి చేయడానికి అంబాలా ఎయిర్‌బేస్‌ను ఉపయోగించుకుందని ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రత్యర్థుల నీచ ఆలోచనలకు అద్దం పడుతోంది. ఈ వాదన పూర్తిగా నిరాధారమైనదని, ఇది తప్పుడు సమాచార ప్రచారంలో భాగమని PIB గుర్తించింది. రక్షణ మంత్రిత్వ శాఖ వివరణాత్మక పత్రికా ప్రకటనను PIB అందించింది. వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచింది.
7. భారతదేశం అంతటా విమానాశ్రయాల్లోకి ప్రవేశాన్ని నిషేధించారని పేర్కొంటూ ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. PIB ఆ నకిలీ కథనాన్ని ఛేదించి, తోసిపుచ్చింది. ప్రభుత్వం నుంచి అలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.