Operation Sindoor : పాకిస్తాన్ గత రోజు (మే 8, 2025) 15 సైనిక స్థావరాలపై డ్రోన్ దాడుల ప్రయత్నాలను విఫలం చేసిన తరువాత, భారత సైన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్  చేసిన దాడులకు భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని సైన్యం తెలిపింది.

సైన్యం తన ప్రకటనలో, 'పాకిస్తాన్ సాయుధ దళాలు 2025 మే 8,  9 మధ్యరాత్రి సమయంలో పశ్చిమ సరిహద్దులో డ్రోన్లు, ఇతర ఆయుధాలను ఉపయోగించి అనేక దాడులు చేశాయి. అదనంగా, పాకిస్తాన్ జమ్మూ-కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LoC) వద్ద అనేక సార్లు కాల్పుల విరామ ఒప్పందాన్ని  ఉల్లంఘించింది. భారత సైన్యం ఈ డ్రోన్ దాడులను సమర్థవంతంగా విఫలం చేసింది. కాల్పుల విరామ ఒప్పంద ఉల్లంఘనలకు తగిన చర్యలు తీసుకుంది. భారత సైన్యం దేశ ప్రజల భూభాగ సమగ్రతను కాపాడటానికి పూర్తిగా కట్టుబడి ఉంది. ఎలాంటి  దుష్ప్రయత్నాలు చేసినా కఠినంగా ప్రతిస్పందిస్తుంది."

పాకిస్తాన్ ఈ ప్రాంతాలపై  డ్రోన్ దాడులకు విఫలయత్నం 

వివిధ వర్గాల సమాచారం ప్రకారరం గత రాత్రి పాకిస్తాన్ నియంత్రణ రేఖ (LoC), అంతర్జాతీయ సరిహద్దు (IB) సమీపంలో అనేక ప్రదేశాలలో డ్రోన్ దాడులు చేయడానికి  విఫలయత్నం చేసింది. దీనికి ప్రతిస్పందనగా, భారత సైన్యం వాయు రక్షణ విభాగాలు ఉదంపూర్, సాంభా, జమ్మూ, అఖ్నూర్, నగరోటా  పఠాన్ కోట్ వంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహించి 50 కంటే ఎక్కువ డ్రోన్లను ఛేదించాయి. ఈ సమయంలో ఆధునిక ఆయుధాలను ఉపయోగించారు.