India-Pakistan Tension:భారతదేశం, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతల మధ్య పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో పడిపోయిన అనుమానిత డ్రోన్‌ను భారత సైన్యం విజయవంతంగా అడ్డుకుంది. జమ్మూ కశ్మీర్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం డ్రోన్‌లు, ఇతర ఆయుధాలతో దాడులను తీవ్రతరం చేసిన సమయంలో ఈ ఘటన జరిగింది. వీటితోపాటు భారత్ సైన్యం పాకిస్థాన్‌కు చెందిన ఓ క్షిపణిని కూడా పేల్చేశారు. భారత నగరాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆధారాలు ఉన్నాయి. పాకిస్తాన్ క్షిపణులను, డ్రోన్‌లను భారతదేశం విజయవంతంగా కూల్చివేసింది. సోషల్ మీడియాలోని అనేక వీడియోలు సిర్సాలోని భారత గగనతలంలో పాకిస్తాన్ దీర్ఘ-శ్రేణి క్షిపణిని భారతదేశం విజయవంతంగా అడ్డగించిందని చూపిస్తున్నాయి.
ANI నివేదిక ప్రకారం, అమృత్‌సర్‌లోని ఒక గ్రామంలో ఒక డ్రోన్ కూలిపోయింది. సైన్యం సహాయంతో దాన్ని అడ్డుకొని డీ యాక్టివేట్ చేస్తుండగా, భారీ పేలుడు జరిగింది. దీని వీడియో ఫుటేజ్ బయటపడింది. సైన్యం దానిని నియంత్రిత పద్ధతిలో ఈ ప్రక్రియ చేపట్టడంతో పెద్ద ప్రమాదాన్ని నివారించింది. ఈ ప్రాంతంలో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు రిజిస్టర్ కాలేదు.
భారత సైన్యం వీడియో విడుదల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)లో భారత సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లతో అనేక ప్రదేశాలపై దాడి చేసింది. నియంత్రణ రేఖ (LoC) వద్ద అనేకసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొంది. ఈ దాడులన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టామని, వాళ్లు దాడి చేసిన అన్నివైపు నుంచి గట్టిగానే బుద్ది చెప్పామని సైన్యం తెలిపింది. మే 7న భారతదేశం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన తర్వాత పాకిస్తాన్ దుష్టపన్నాగాలకు పాల్పడుతోంది. భారతదేశం కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను పేల్చేసింది.
అమృత్‌సర్ చుట్టుపక్కల సరిహద్దు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు నష్టం కలిగించే ఎలాంటి చర్యనైనా అడ్డుకుంటామని సైన్యం చెబుతోంది. ఇప్పటి వరకు సైన్యం చేసిన శ్రమ దాన్ని నిరూపిస్తోంది. భారతదేశంపై జరిగే ఎలాంటి దుర్మార్గపు దాడికి కచ్చితంగా గట్టి సమాధానం ఇస్తామని సైన్యం హెచ్చరించింది. ఈ ఘటన తర్వాత అమృత్‌సర, చుట్టుపక్కల సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పెంచారు.
పాకిస్తాన్ టర్కిష్ తయారీ డ్రోన్‌లను ఉపయోగించిందని నిపుణులు భావిస్తున్నారు, భారత సైన్యం తన వైమానిక రక్షణ వ్యవస్థను ఉపయోగించి వాటిని గాల్లోనే కూల్చివేసింది. సరిహద్దులో పరిస్థితి సున్నితంగానే ఉంది, కానీ భారతదేశం వ్యూహం స్పష్టంగా ఉంది. ప్రతి దాడికి తగిన విధంగా ప్రతిస్పందిస్తుంది. పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.