Pahalgam Terror Attack |  న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పాకిస్తాన్ కు చెందిన సంస్థ ఉగ్రదాడిపై భారత్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇదివరకే సింధు జలాల ఒప్పందం సహా ఐదు నిర్ణయాలు తీసుకోవడం తెలిసిందే. తాజాగా సింధూ నదీ జలాల ఒప్పందంపై నిషేధం విధించినట్లు భారత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో భారత్ నుంచి పాక్‌కు సింధు జలాలు పాక్ కు ఇచ్చేది లేదని భారత్ అధికారికంగా దాయాది దేశానికి దేశానికి స్పష్టం చేసినట్లు అయింది. గురువారం రాత్రి కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు పాక్ కు లేఖ రాశారు.

‘1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది’ అని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పాకిస్తాన్ జల వనరుల శాఖ కార్యదర్శికి గురువారం రాత్రి లేఖ రాశారు. నీటి అవసరాలను టార్గెట్ చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పాకిస్థాన్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇరుదేశాల మధ్య ఇప్పటివరకూ 4 యుద్ధాలు జరిగినా ఎన్నడూ కేంద్ర ప్రభుత్వం సింధు జలాల ఒప్పందంపై కఠిన నిర్ణయాలు తీసుకోలేదు. కానీ పహల్గాంలోని పర్యాటక ప్రాంతంలో ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే లష్కర్ ఈ తోయిబా గ్రూప్ ఉగ్రవాదులు చేసిన దాడిలో భారత పౌరులు చనిపోవడంతో మోదీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. 

తొలిసారి పాకిస్థాన్‌ పై తీవ్ర ప్రభావం చూపేలా భారత ప్రభుత్వం సింధు జలాల ఒప్పందంపై నిషేధం, అటారి-వాఘా సరిహద్దును వెంటనే మూసివేయడం, ఎస్‌వీఎస్‌ఈ వీసాల కింద భారతదేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు 48 గంటల గడువు, పాకిస్థాన్ పౌరులకు వీసాలు జారీ చేయడంపై నిషేధం, ఇరుదేశాల హైకమిషన్లలో నియమించిన అధికారుల సంఖ్య తగ్గించడం లాంటి నిర్ణయాలు తీసుకుంది. 

సింధు జలాలపై ఆరున్నర దశాబ్దాల కిందట ఒప్పందం1960లో భారత్, పాక్ మధ్య సింధు జలాలపై ఒప్పందం కుదిరింది. వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వం చేసింది. తూర్పున ప్రవహించే రావి, సట్లెజ్, బియాస్ నదుల జలాలు భారత్‌కు చెందుతాయి. అదేవిధంగా పశ్చిమ దిశలో ప్రవహిస్తున్న సింధు, జీలం, చినాబ్‌ నదుల జలాలు పాకిస్థాన్‌ వినియోగించుకోవాలని ఇరు దేశాల మధ్య ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం చేసింది. అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, పాకిస్థాన్‌ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌ సింధు జలాల ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఒప్పందం ప్రకారం సింధు నదీ జలాల్లో భారత్‌ 20 శాతం, పాకిస్థాన్‌ 80 శాతం వినియోగించుకోవాలి. ఆనాటి ఒప్పందం ప్రకారం సింధు, జీలం, చినాబ్ జలాలు ఎలాంటి అవాంతరం లేకుండా పాక్‌లో ప్రవహించడానికి భారత్‌ వీలు కల్పించాల్సి ఉంటుంది. కానీ పశ్చిమ నదుల నీటి వినియోగంపై పూర్తి నిషేధం లేదు. అయితే ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేసేందుకు ఎలాంటి నిబంధనలూ ఒప్పందంలో లేవు. కానీ పాక్ దుశ్చర్యలకు బుద్ధి చెప్పాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికిప్పుడు సింధు జలాలను పాక్ కు నిలిపివేసినా వాటిని భారత్ వినియోగించుకోవాలంటే కొన్నేళ్లు సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితేనే ఆ నీటిని భారత్ తమ విద్యుత్, సాగు అవసరాలకు వినియోగించుకోనుంది.