Opposition Meeting:
14 మంది సభ్యులు..
ముంబయిలో భేటీ అయిన I.N.D.I.A కూటమి (Mumbai Meeting) కీలక ప్రకటన చేసింది. కోఆర్డినేషన్ కమిటీ సభ్యుల పేర్లు అధికారికంగా ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్, టీఎమ్‌సీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ ఉన్నారు. వీరితో పాటు శివసేన ఎంపీ సంజయ్ రౌత్, బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్, జేడీయూ లీడర్ లలన్ సింగ్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పేర్లనూ ఖరారు చేశారు. ఎస్‌పీకి జాదవ్ అలీ ఖాన్, సీపీఐ నేత డీ రాజా, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీని కూడా ఎంపిక చేశారు. ఇకపై కూటమి తీసుకునే నిర్ణయాలతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలను ఈ కమిటీయే ఖరారు చేస్తుంది. ప్రచార వ్యూహాలు, జాతీయ స్థాయి అజెండాలనూ త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే..కన్వీనర్ పేరుని మాత్రం ఇంకా ప్రకటించలేదు. నిజానికి కన్వీనర్ పేరుతో పాటు లోగో కూడా లాంఛ్ చేస్తారని అంతా భావించారు. మీటింగ్ ప్లాన్‌లోనూ ఈ అంశాలున్నాయి. కానీ...చివరి నిముషంలో ప్లాన్ మారిపోయినట్టు సమాచారం. సీనియర్ నేతల సూచనలు, సలహాల వల్ల అప్పటికప్పుడు ప్రణాళికలు మార్చినట్టు తెలుస్తోంది. 14 మంది సభ్యులతో కూడిని కమిటీని ఏర్పాటు చేసినట్టు ఉద్దవ్ థాక్రే శివసేన నేత సంజయ్ రౌత్ వెల్లడించారు.
ఇక ఈ భేటీలో మూడు కీలక తీర్మానాలు చేసింది కూటమి. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు అన్ని పార్టీలు అంగీకారం తెలిపినట్టు కూటమిలోని కీలక నేతలు ప్రకటించారు. ఈ నెల మూడో వారం నుంచి ర్యాలీలు చేయాలని నిర్ణయించారు. ప్రజాసమస్యలపై పోరాడడమే తమ ఉద్దేశమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. సీట్‌ల షేరింగ్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే సీట్ల సర్దుబాటు జరుగుతుందని స్పష్టం చేశారు.
"లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని తీర్మానించాం. ఈ నెల మూడో వారం నుంచి ర్యాలీలు చేపట్టనున్నాం. సీట్‌ల షేరింగ్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడాలని నిర్ణయించుకున్నాం. ప్రజాసమస్యలపై పోరాటం చేయడమే మా లక్ష్యం. జుడేగా భారత్, జీతేగా ఇండియా నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నాం"
- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
బీజేపీని I.N.D.I.A కూటమి ఓడించడం ఖాయం అని తేల్చి చెప్పారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఈ బలమైన శక్తిని ఢీకొట్టడం మోదీ తరం కాదని స్పష్టం చేశారు. అదానీ వ్యవహారంపై విచారణ జరిపి తీరాలని డిమాండ్ చేశారు.
"విపక్షాలన్నీ ఒక్కటైతే బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించడం అసాధ్యం. బీజేపీని ఓడించడానికి పక్కా ప్లాన్‌తో ఉన్నాం. ఇప్పటికే కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేశాం. త్వరలోనే సీట్ షేరింగ్ విషయంలోనూ స్పష్టత వస్తుంది. విపక్ష కూటమి బీజేపీని ఓడిస్తుందన్న నమ్మకం ఉంది"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
Also Read: స్థానిక పార్టీలను అణిచివేసేందుకే ఈ జమిలి ఎత్తుగడ, బీజేపీపై విపక్షాల విమర్శలు