One Nation One Election: 


రాజకీయాల్లో అలజడి..


ఒకే దేశం ఒకే ఎన్నిక అంశం రాజకీయాల్లో మరోసారి అలజడి రేపింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ నేతృత్వంలో ఇప్పటికే ఓ కమిటీ ఏర్పాటైంది. సాధ్యాసాధ్యాలపై ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నా విపక్షాలు మాత్రం బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ముందుగా నిర్వహించాలన్న కుట్రతోనే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని మండి పడుతున్నాయి. ఉద్దవ్ బాల్‌థాక్రే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. దేశం ఒక్కటిగానే ఉందని, అలాంటప్పుడు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని ఇలా రాజకీయాల్లోకి లాగడం సరికాదని మరి కొందరు విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. డబ్బు ఆదా అవుతుందనే వాదన వినిపించి తప్పుదోవ పట్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 


"దేశమంతా ఒక్కటే. ఎప్పుడూ ఒక్కటిగానే ఉంటుంది. ఈ ఇంటిగ్రిటీని ఎవరూ ప్రశ్నించలేదు కదా. అలాంటప్పుడు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏముంది..? మాకు కావాల్సింది పారదర్శకమైన ఎన్నికలు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కాదు. కేవలం పారదర్శకతను పాటించకుండా ఉండేందుకే ఇలా జమిలి ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు"


- సంజయ్ రౌత్, శివసేన ఎంపీ




ఉద్దవ్ థాక్రే శివసేన నేత అనిల్ దేశాయ్ కూడా జమిలి ఎన్నికలపై మండి పడ్డారు. రాజకీయ పార్టీలతో పూర్తి స్థాయిలో చర్చించిన తరవాతే తుది నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


"వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్‌పై రాజకీయ పార్టీలతో కచ్చితంగా చర్చించాలి. అందరి అభిప్రాయాలు సేకరించాలి. పూర్తిస్థాయిలో డిబేట్ జరగాలి. అప్పుడు కానీ తుది నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు"


- అనిల్ దేశాయ్, శివసేన నేత 


కాంగ్రెస్ నేత ఆరిఫ్ నసీమ్ ఖాన్ ఈ నిర్ణయాన్ని ఖండించారు. మాజీ రాష్ట్రపతిని రాజకీయాల్లోకి లాగడం సరికాదని తేల్చి చెప్పారు. 


"మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని రాజకీయాల్లోకి లాగడమేంటి..? ఇలాంటి కమిటీకి ఆయనను చీఫ్‌గా చేయడం సరికాదు"


- ఆరిఫ్ నసీమ్ ఖాన్, కాంగ్రెస్ నేత 




JMM నేత మహువా మంజీ కూడా జమిలి ఎన్నికలపై స్పందించారు. డబ్బు ఆదా అవుతోందని వాదిస్తున్న వాళ్లంతా ప్రస్తుత ప్రభుత్వం తమ ప్రచారం కోసం ఎంత ఖర్చు పెడుతోందో గమనించాలని అన్నారు. 


"ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చు ఆదా అవుతుందని కొందరు చెబుతున్నారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తమ ప్రచారం కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో గమనించాలి. ఈ నిర్ణయం వల్ల స్థానిక పార్టీలకు నష్టం తప్పదు. పెద్ద పార్టీలన్నీ కలిసి చిన్న పార్టీలను నియంత్రించే ప్రమాదముంది"


- మహులా మంజీ, JMM నేత