Opposition Meet:



15 పార్టీల సమావేశం..


కొద్ది నెలలుగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్ పలు రాష్ట్రాల్లో పర్యటించారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి ఎదురు నిలబడేందుకు కలిసి రావాలని కోరారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్‌ని కలిశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోనూ భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే బిహార్‌లోని పట్నాలో విపక్షాల ఐక్యతా సమావేశాన్ని నిర్వహించారు. జేడీయూ, ఆర్‌జేడీతో పాటు దాదాపు 15 పార్టీల కీలక నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలోని కీలక నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2024 ఎన్నికల వ్యూహాలు రెడీ చేసే బాధ్యతను నితీష్ కుమార్‌కే ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా ప్రతిపక్ష పార్టీలన్నింటికీ ఆయనే కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఈ భేటీలో మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, శరద్ పవార్‌ పాల్గొన్నారు. అయితే...ఇంత కీలక సమావేశంలో ప్రముఖ నేతలు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. బీజేపీపై యుద్ధం ప్రకటించిన BRS అధినేత కేసీఆర్‌ హాజరు కాలేదు. అటు బీఎస్‌పీ అధినేత మాయావతి, AIMIM లీడర్ అసదుద్దీన్‌ ఒవైసీ కూడా రాలేదు. కాంగ్రెస్‌తో కలిసేందుకు బీఆర్‌ఎస్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. విపక్షాలు యునిటీగా పోరాటం చేయాలని నితీష్ కుమార్ భావిస్తున్నా...కొన్ని పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు తలెత్తుతున్నాయి. వాటిని తీర్చేందుకు నితీష్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. 






విభేదాలు మాటేంటి..? 


ఈ భేటీ జరిగే ముందు కూడా ఆప్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. కేంద్రం ఢిల్లీలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై ఈ రెండు పార్టీలు తలోవాదన వినిపించాయి. ఈ ఆర్డినెన్స్ విషయంలో బీజేపీతో కాంగ్రెస్ కుమ్మక్కైందని ఆప్ ఆరోపిస్తోంది. అటు కాంగ్రెస్ మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టి పారేస్తోంది. ఒక్క ఆప్ మాత్రమే కాదు. TMC కూడా కాంగ్రెస్‌ని టార్గెట్ చేసింది. పంచాయత్ ఎన్నికల్లో చెలరేగిన హింసకు కాంగ్రెస్ కారణమని ఆరోపించింది. పంజాబ్‌లో ఆప్ వర్సెస్ కాంగ్రెస్ పోరు నడుస్తోంది. కేరళలో లెఫ్ట్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్‌ నెలకొంది. ఎలా చూసినా...విపక్షాల మధ్య మైత్రి కుదరడం లేదు. అన్ని పార్టీలు ఏకమై కచ్చితంగా  బీజేపీతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాయని రాహుల్ గాంధీ ప్రకటించారు. అటు ఖర్గే కూడా ఇదే ప్రకటన చేశారు. విపక్షాలను ఒక్కటి చేయడంలో రాహుల్ కీలక పాత్ర పోషిస్తున్నారని స్పష్టం చేశారు. బిహార్‌లో గెలిస్తే దేశాన్ని గెలిచినట్టే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఖర్గే. పార్టీలతో చిన్న చిన్న విభేదాలున్నప్పటికీ బీజేపీపై పోరాటం చేసేందుకు అందరూ ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. ఇక నితీష్ కుమార్ విషయానికొస్తే...ఆయన 2024 ఎన్నికల్లో ప్రధాని రేసులో ఉంటారన్న ప్రచారమూ జరుగుతోంది. దీనిపై ఇంతవరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. 


Also Read: భారత్‌లో మైనార్టీల హక్కులకు రక్షణ ఉందా? ప్రధాని మోదీని ప్రశ్నించిన అమెరికన్ జర్నలిస్ట్