న్యూఢిల్లీ: పహల్గాంలో ఈ ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. గత కొన్ని రోజులుగా భారత్ ప్లాన్ ఏంటో తెలియక సతమతం అవుతున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇప్పటికైనా ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుంది. భారత బలగాలు మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టాయి.
పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (POK)లోని ఉగ్రవాద శిబిరాలలో మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై భారత బలగాలు ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఆకస్మిక దాడులు చేశాయి. అయితే భారతదేశం ఈ దాడులను ప్రారంభించడానికి కొన్ని నిమిషాల ముందు, భారత సైన్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతోంది. "దాడికి సిద్ధంగా ఉంది, గెలవడానికి శిక్షణ తీసుకుంది" అని ఆపరేషన్ సిందూర్ కు కొన్ని నిమిషాల ముందు ఇండియన్ ఆర్మీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఆ తరువాత కాసేపటికే భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పీఓకేలోని జైషే మహ్మద్, లష్కరే తోయిబాలకు చెందిన 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి. భారత సైన్యం విజయవంతంగా దాడులు పూర్తి చేసి లక్ష్యాన్ని ఛేదించింది అని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. భారతదేశం ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడులకు సంబంధించి తెల్లవారుజామున 1.44 గంటలకు మరో ప్రకటన విడుదల చేసింది. ఉగ్రవాదుల స్థావరాలు మట్టుపెట్టాం. పహల్గాం దాడికి ప్రతీకార చర్యలు మొదలుపెట్టామని స్పష్టం చేశారు.
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 26 మంది చనిపోగా.. అందులో 25 మంది భారతీయులు, ఓ నేపాల్ టూరిస్ట్ ఉన్నారని కేంద్రం తెలిపింది. అయితే పహల్గాం దాడిలో చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయడానికి ప్రధాని మోదీ కొన్ని రోజుల కిందట హామీ ఇచ్చారు అందులో భాగంగా.. ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతామని హింట్ ఇచ్చేందుకు ఆపరేషన్ సిందూర్‌కు శ్రీకారం చుట్టారు.
ఆపరేషన్ సిందూర్ గురించి విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో పాటు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాకు వివరించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాడులు, పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద సంస్థలు చేసిన దాడుల కారణంగా ముంబై దాడులు, పుల్వామా, పహల్గాం, హైదరాబాద్ లో పేలుళ్ల లాంటి ఘటనలో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఇటీవల పహల్గాంలోనూ మన భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది ప్రాణాలు తీశారు. భారత్ మీద మరిన్ని ఉగ్రదాడులకు జైషే మహ్మద్, లష్కరే తోయిబా సంస్థలు కుట్ర పన్నాయని సమాచారం ఉందన్నారు. ఉగ్రవాదాన్ని, ఉగ్రదాడులను ఉపేక్షించేది లేదని పాకిస్తాన్, పీఓకేలోకి వెళ్లినా కేవలం ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసి ధ్వంసం చేసినట్లు తెలిపారు.
కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను సైతం ఆపరేషన్ సిందూర్ లో భాగంగా నాశనం చేశామన్నారు. మొత్తం 21 ఉగ్రవాద స్థావరాలను ఇంటెలిజెన్స్ గుర్తించగా.. అందులో అత్యంత ప్రమాదకరమైన 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేపట్టి విజయం సాధించినట్లు చెప్పారు. మురిద్కేలో గల లష్కరే తోయిబా ఉగ్రవాద క్యాంపును సైతం ధ్వంసం చేసినట్లు తెలిపారు. పాక్ పౌరులు, పాక్ సైన్యాన్ని టచ్ చేయకుండా వాటికి దూరంగా ఉన్న ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా ఆపరేషన్ నిర్వహించామని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చెప్పారు.