Indian Navy: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రదాడి అనంతరం భారత నౌకాదళం (Indian Navy) అరేబియా సముద్రంలో తన బలాన్ని, సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ పాకిస్థాన్‌పై నిరంతరం ఒత్తిడి పెంచామని వైస్ అడ్మిరల్ ఎ.ఎన్. ప్రమోద్ తెలిపారు. నేవీ ప్రతినిధి ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ చేసి, పొరుగు దేశాన్ని యుద్ధ విరామానికి ఒత్తిడి చేయడంలో నౌకాదళం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ఒక్క చిన్న సైగ చేస్తే చాలు కరాచీ పోర్టుపై దాడి చేసి నిమిషాల వ్యవధిలో టార్గెట్ పూర్తి చేస్తామన్నారు. 

DGMO లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ చీఫ్‌లతో కలిసి ఇండియన్ నేవీ వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ ఆపరేషన్ సిందూర్ గురించి, అనంతరం తలెత్తిన పరిణామాలపై మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత, భారత నౌకాదళ క్యారియర్ యుద్ధ సమూహం, ఉపరితల దళాలు, జలాంతర్గాములు, భారత రక్షణ దళాల సంయుక్త ఆపరేషన్ ప్రణాళికకు అనుగుణంగా వెంటనే సముద్రంలో మోహరించాం. ఉగ్రవాద దాడి చేసిన 96 గంటల్లోనే ఇండియన్ నేవీ అరేబియా సముద్రంలో పలు ఆయుధాలను, క్షిపణులను విజయవంతంగా ప్రయోగించింది. సముద్రంలో వ్యూహాలు, మా విధానాలను పరీక్షించి మెరుగుపరుచుకున్నాం. ఏ క్షణంలోనైనా దాడికి ప్రతిదాడి చేసేలా పూర్తిగా సన్నద్ధమైంది నేవీ. టార్గెట్స్ ఛేదించేలా నేవీ ఏర్పాట్లు పూర్తి చేసుకుందన్నారు. 

ప్రభుత్వ ఆదేశం కోసం ఎదురు చూశాంవిలేకరుల సమావేశంలో నౌకాదళ జనరల్ డైరెక్టర్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ (DGNO) వైస్ అడ్మిరల్ ఎ.ఎన్. ప్రమోద్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.  ఇండియన్ నేవీ మే 9 రాత్రి పాకిస్థాన్ సముద్ర సరిహద్దులోకి చొచ్చుకుపోయి, వారి సైనిక స్థావరాలు, కరాచీ పోర్ట్ వంటి పెద్ద స్థావరాలపై దాడి చేసేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ నుంచి ఒక్క చిన్న ఆదేశం కోసం మాత్రమే తాము ఎదురు చూశామని తెలిపారు. 

సముద్రం, భూమిపై ఎంచుకున్న టార్గెట్స్‌పై దాడి చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాం. ఉత్తర అరేబియా సముద్రంలో ముందుగానే నేవీ మోహరించింది. దాంతో పాకిస్థాన్ నౌకాదళం, పాక్ ఎయిర్ ఫోర్స్ యూనిట్లు పోర్టుల లోపల లేదా వారి తీరాలకు చాలా దగ్గరగా డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్లేలా ఒత్తిడి పెంచామన్నారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ కలిసి పాక్ మీద ఒత్తిడి పెంచడంతో పాటు వారు దాడిచేస్తే తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు సన్నద్ధమయ్యాం. ఎయిర్‌ఫోర్స్ సమన్వయంతో ఇండియన్ నేవీ అరేబియా సముద్రంలో మోహరించి పాక్‌లో టెన్షన్ పెంచినట్లు తెలిపారు.

నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు చేపట్టిన వేగవంతమైన, స్ట్రాంగ్ యాక్షన్.. అరేబియా సముద్రంలో భారత నేవీ అద్భుతమైన ఆపరేషనల్ సామర్థ్యం పాకిస్థాన్‌ను యుద్ధ విరామం కోసం వెంటనే అభ్యర్థించేలా చేయడానికి దోహదం చేసిందని నేవీ ప్రతినిధి తెలిపారు.