అత్యంత భయానక రీతిలో జరిగిన ఒడిశా రైలు ప్రమాద ఘటన జరిగిన తీరు విస్మయం కలిగిస్తోంది. విపరీతమైన బరువుతో ఉండే రైలు పట్టాలు తప్పితే, దాన్ని తిరిగి పట్టాలపైకి ఎక్కించడం మామూలు విషయం కాదు. ఎంతో వ్యయప్రయాసలు పడాలి. అలాంటిది, ఒడిశాలో జరిగిన ప్రమాదంలో రైలు ఇంజిన్ ఏకంగా గూడ్స్ రైలు పైకి ఎక్కేసింది. దాదాపు 15 అడుగులు ఎత్తున ఉండే గూడ్స్ రైలు వ్యాగన్ పైకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దూసుకొని వెళ్లింది. ప్రమాద స్థలంలో పడిఉన్న బోగీలు, ఇంజిన్ ఉన్న స్థానం చూసి నిపుణులు సైతం విస్మయం చెందుతున్నారు.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైన సమయంలో దాదాపు 128 కిలో మీటర్ల వేగంతో వెళుతున్నట్లుగా రైల్వే అధికారులు తెలిపారు. రైలును మెయిన్ లైన్ కాకుండా లూప్ లైన్‌కి మళ్లించినప్పుడు వేగం బాగా తగ్గాల్సి ఉంది. కానీ, కోరమాండల్ ఎక్స్ ప్రెస్ వేగం ఎందుకు తగ్గలేదనేది ఒక ప్రశ్నగా ఉంది. ఆ వేగంతోనే కోరమాండ్ రైలు ఆగి ఉన్న గూడ్స్ రైలును వెనక నుంచి బలంగా ఢీకొని రైలింజన్ వ్యాగన్ పైకి ఎక్కేసిందని నిపుణులు భావిస్తున్నారు.
గూడ్స్ రైలులో ఒక్కో ఖాళీ వ్యాగన్ 25 - 26 టన్నుల బరువు ఉంటుంది. దాంట్లో నింపే సరకు బరువు ఒక్కో దాంట్లో మరో 54-60 టన్నుల దాకా ఉండొచ్చు. అలాంటి వ్యాగన్ పైకి రైలింజన్ ఎక్కేసింది. 128 కిలో మీటర్ల వేగంతో ఢీకొట్టడం వల్లే కోరమాండల్ ఇంజిన్ గూడ్సు రైలుపైకి ఎక్కినట్లు నిపుణులు భావిస్తున్నారు.
చనిపోయిన వారి సంఖ్య 288కి
శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 288కు చేరుకుంది. 56 మంది తీవ్ర గాయాలపాలయ్యారని, మరో 747 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో తెలుగువాళ్లే వంద మందికిపైగా ఉన్నారని సమాచారం.
మరోవైపు, ఒడిశాలోని బాలాసోర్ లో రైలు ప్రమాదం జరిగిన స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను ఆరా తీశారు. ప్రమాదానికి సంబంధించి రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రాథమిక రిపోర్టును ప్రధానికి వివరిస్తున్నారు.