Odisha Train Accident: 290 మంది మృతి చెందిన, వందలాది మంది గాయపడిన ఒడిశా రైలు ప్రమాదం గురించి దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ఈ కేసులో గతంలో అరెస్టయిన ముగ్గురు రైల్వే ఉద్యోగులపై తాజాగా సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ముగ్గురు రైల్వే అధికారులు అరుణ్ కుమార్ మహంత, ఎండీ అమీర్ ఖాన్, పప్పు కుమార్ లపై హత్య, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం వంటి నేరపూరిత అభియోగాలు మోపింది. ఒడిశాలోని బాలాసోర్ లో సిగ్నలింగ్ వైఫల్యం కారణంగా మూడు రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 290 మంది మృతి చెందారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎంతో మంది వికలాంగులయ్యారు. ఈ ప్రమాదం జరిగిన నెల తర్వాత జులైలో ముగ్గురు రైల్వే అధికారులను అరెస్టు చేశారు.
సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజినీర్ మహ్మద్ అమీర్ ఖాన్, సాంకేతిక నిపుణుడు పప్పు కుమార్ లను ప్రమాదానికి బాధ్యులను చేస్తూ సీబీఐ గతంలో అరెస్టు చేసింది. ఈ ముగ్గురు రైల్వే అధికారులపై భారత శిక్షా స్మృతిలోని 304, 201 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.
గతంలో అరుణ్ కుమార్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఒడిశా రైలు ప్రమాదం గురించి సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. ప్రమాదం జరిగిన తీరుపై, కారణాలపై దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్ధ - సీబీఐ.. అసలు ప్రమాదానికి కారణాలేంటో వివరించింది. అనుమతులు లేని రిపేర్ పనులు చేపట్టడం వల్లే ఒడిశా రైలు దుర్ఘటన జరిగిందని వెల్లడించింది. సీనియర్ సెక్షన్ ఇంజినీర్, సిగ్నల్ ఇంఛార్జ్ అయిన అరుణ్ కుమార్ మహంత.. ఉన్నతాధికారులు నుంచి అనుమతులు తీసుకోకుండా క్షేత్ర స్థాయిలో మరమ్మతులు చేయించినట్లు సీబీఐ గుర్తించింది. ఈ విషయాన్ని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి వివరించింది.
అయితే ఈ ఘోర రైలు దుర్ఘటనకు సంబంధించి సీబీఐ గతంలో ముగ్గురు అధికారులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురిలో అరుణ్ కుమార్ మహంత కూడా ఒకరు. అయితే, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరగ్గా.. సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. సీబీఐ కోర్టూ ఆ వాదనల వైపే మొగ్గింది. అలా అరుణ్ కుమార్ బెయిల్ ను కొట్టేసింది.
ఎలా జరిగింది..?
రైల్వే అధికారుల సమచారం ప్రకారం...12841 షాలిమార్ చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 3.20 నిముషాలకు షాలిమార్ స్టేషన్ నుంచి బయల్దేరింది. బాలాసోర్‌కి సాయంత్రం 6.30 నిముషాలకు చేరుకుంది. ఆ తరవాత అక్కడి నుంచి చెన్నై బయల్దేరిన ట్రైన్ సరిగ్గా 7.20 నిముషాల సమయంలో బాలేశ్వర్ వద్ద ఒక్కసారిగా అదుపు తప్పింది. దాదాపు 10-12 కోచ్‌లు పట్టాలు తప్పి పడిపోయాయి. పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. అప్పటికే అక్కడ ఓ గూడ్స్ ట్రైన్ పార్క్ చేసి ఉంది. ఆ గూడ్స్ ట్రైన్‌ని కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు బలంగా ఢీకొట్టాయి. ఆ తరవాత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు పడిపోయిన ట్రాక్‌పైన 12864 బెంగళూరు హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ దూసుకొచ్చింది. అప్పటి వరకూ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పడిపోయినట్టు ఎవరికీ సమాచారం అందలేదు. వేగంగా దూసుకొచ్చిన హౌరా ఎక్స్‌ప్రెస్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొట్టింది. ఫలితంగా..మూడు నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పి పడిపోయాయి. అంటే ఇవి ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ప్రమాద సమయంలో రెండు రైళ్లూ వేగంగా ఉండటం వల్ల ప్రాణనష్టం ఎక్కువగా నమోదైంది. ఇదంతా మొత్తం 20 నిముషాల్లోనే జరిగిపోయింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కొందరు ఆ నిద్రలోనే కన్నుమూశారు.