G20 Summit: ప్రతిష్టాత్మక జీ20 సదస్సు కోసం దేశ రాజధాని ఢిల్లీలో సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ శిఖరాగ్ర సమావేశం కోసం కట్టుదిట్టమైన భద్రతతో పాటు అంబరాన్నంటే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు దేశవిదేశాలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. జీ20 కూటమిలో 20 దేశాల అగ్రనేతలతో పాటు మరిన్ని దేశాల ప్రతినిధులు ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రాజధాని ఢిల్లీలో భారీగా ఏర్పాట్లు చేస్తోంది. జీ20 సదస్సు జరగనున్న ప్రదేశానికి ఎదురుగా భారీ నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. భారీ ఏర్పాట్లపై మధ్య ఈ అతిపెద్ద నటరాజ విగ్రహం సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలవనుంది.


28 అడుగుల భారీ నటరాజ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించింది కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ఈ విగ్రహాన్ని తమిళనాడులో ప్రత్యేకంగా రూపొందించి ఢిల్లీకి తెప్పించారు. ఈ అతిపెద్ద నటరాజ విగ్రహాన్ని తమిళనాడు కుంభకోణం తాలూకా స్వామిమలైలోని దేవ సేనాపతి శిల్పకళాశాలలో తయారు చేశారు. దేవా. రాధాకృష్ణన్, దేవా.పి. కందన్, దేవా స్వామినాథన్ తమ సహోద్యోగులతో కలిసి ఆరు నెలల పాటు శ్రమించి ఈ నటరాజ విగ్రహాన్ని రూపొందించారు. ఈ భారీ విగ్రహాన్ని తమిళనాడు నుంచి ఢిల్లీకి రోడ్డు మార్గం ద్వారా తీసుకువచ్చారు. సుదీర్ఘమైన గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి దాదాపు రెండున్నర వేల కిలోమీటర్లు ఈ విగ్రహాన్ని తరలించారు. తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మీదుగా ఢిల్లీకి చేర్చారు. శిఖరాగ్ర సదస్సు జరిగే ప్రగతి మైదాన్ లోని భారత్ మండపంలో ఈ 19 టన్నుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. 






ఈ నటరాజ విగ్రహాన్ని బంగారం, వెండి సహా 8 లోహాలతో తయారు చేశారు. ఈ విగ్రహం రూపకల్పన కోసం కేంద్ర మంత్రిత్వ శాఖ ఆరు నెలల ముందే ఆర్డర్ ఇచ్చింది. విగ్రహం మొత్తం ఎత్తు 22 అడుగులు కాగా.. దాని స్టాండ్ 6 అడుగుల ఎత్తు ఉంటుంది. 21 అడుగుల వెడల్పు ఉంటుంది. దాదాపు రూ.10 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం. 


Also Read: Pratapgarh: నగ్నంగా ఊరేగించిన గిరిజన మహిళకు రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం- రాజస్థాన్ సీఎం


సెప్టెంబరు 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్‌కు 29 మంది దేశాధినేతలతో పాటు యూరోపియన్ యూనియన్ ఉన్నతాధికారులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరు కానున్నారు. ఈ సమ్మిట్ ముగింపులో G20 లీడర్స్ డిక్లరేషన్‌ని ఆమోదిస్తారు. సెప్టెంబరు 7 రాత్రి నుంచి సెప్టెంబరు 10 వరకూ ఢిల్లీలో ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఆంక్షల్లో భాగంగా న్యూఢిల్లీ ప్రాంతంలో నివాసం ఉండేవారు ఆ పరిధిలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. కానీ, చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చిన వారు లేదా టూరిస్టులు న్యూఢిల్లీ పరిధిలోకి రావాలంటే హోటల్ బుకింగ్స్ కి సంబంధించిన ప్రూఫ్ చూపించాలని వివరించారు. అంతేకాక, ప్రజలు సెప్టెంబరు 8, 9, 10 తేదీల్లో మార్కెట్లకు, దుకాణాలకు వెళ్లొద్దని సూచించారు.