Odisha CM Naveen Patnaiks close aide VK Pandian: భువనేశ్వర్‌: ఒడిశా రాజకీయాలు కొన్ని రోజుల్లో మారేలా కనిపిస్తున్నాయి. స్వచ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఐఏఎస్ అధికారి వీకే పాండియ‌న్ బీజూ జనతాదళ్ పార్టీ (VK Pandian joins BJD)లో చేరారు. ఇటీవల వీఆర్ఎస్ తీసుకున్న మరుసటి రోజే ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్ (Odisha CM Naveen Patnaik) మాజీ ఐఏఎస్ అధికారి వీకే పాండియ‌న్‌కు ఒడిశా ప్ర‌భుత్వం కేబినెట్ మంత్రి హోదా కల్పించడం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం నవీన్ పట్నాయక్ సమక్షంలో ఆయన పార్టీ బీజేడీలో చేరారు పాండియన్. ఇంతకాలం తెరవెనుక ఉన్న ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి పార్టీలో సీనియర్ నేతలకు షాకిచ్చారు. బీజేడీలో చేరికతో పార్టీలో పాండియన్ నెంబర్ 2 అనే ఊహాగానాలకు మరోసారి ఊతమిచ్చినట్లయింది. 


గత నెలలో ఐఏఎస్ అధికారి వీకే పాండియ‌న్‌ స్వచ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. అంతలోనే సీఎం నవీన్ పట్నాయక్ ఆయనకు కేబినెట్ మంత్రి హోదా ఇచ్చారు. 5టీ(ట్రాన్స్‌ఫౄర్మేష‌న‌ల్ ఇనిషియేటివ్‌), ‘నబిన్ ఒడిశా’ ప‌థ‌కానికి చైర్మన్‌గా పాండియన్ ను నియమించారు. నేరుగా సీఎం నవీన్ పట్నాయక్ కింద పాండియన్ పనిచేయనున్నారని, త్వరలోనే పార్టీలో చేరే ఛాన్స్ ఉందని సైతం నెల రోజులనుంచి ప్రచారం జరుగుతోంది. గంజాం జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి ఒడిశా సీఎం ప్రైవేట్ కార్యదర్శి వరకు ఎదిగారు పాండియన్.


పాండియన్ ఎలా ఎదిగారంటే..
ఒడిశా  క్యాడర్‌లో 2000 ఏడాది బ్యాచ్‌కు చెందిన ఆ ఐఏఎస్‌ అధికారి పేరు వీకే పాండియన్‌. అప్పుడు ఆయన వయసు 28 ఏళ్లు. ఆయన ధర్మగఢ్‌ సబ్ కలెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించారు. 2005లో నక్సల్ ప్రభావిత ప్రాంతం మయూర్‌భంజ్‌ కలెక్టర్‌గా నియమితులయ్యారు. 2007లో నవీన్‌ పట్నాయక్ స్వస్థలమైన గంజాం కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ముఖ్యమంత్రి నమ్మకాన్ని చూరగొన్నారు. దాంతో 2011లో ముఖ్యమంత్రి కార్యాలయానికి బదిలీ అయ్యారు. నవీన్ పట్నాయక్ పాండియన్‌ను తన ప్రైవేట్ సెక్రటరీగా చేసుకున్నారు. ఆ తరువాత పాండియన్ పార్టీ నుంచి రాష్ట్ర యంత్రాంగం వరకు ప్రతిదీ నియంత్రించేవారు. ఆయన గ్రీన్ సిగ్నల్ లేకుండా ఏదీ కదలదు.  ఆ తర్వాత సీఎం వ్యక్తిగత కార్యదర్శిగా పదోన్నతి పొందారు.                    
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో సహా నవీన్ పట్నాయక్, ఇతర నాయకుల మధ్య జరిగిన కొన్ని క్లోజ్డ్ డోర్ సమావేశాలలో, గదిలో పాండియన్ మాత్రమే ఉన్నారు. సెప్టెంబరులో BJD పార్టీ వ్యవహారాల్లో పాండియన్ జోక్యాన్ని సౌమ్య రంజన్ పట్నాయక్ ప్రశ్నించారు. పర్యటనల కోసం పాండియన్ హెలికాప్టర్‌కు అయ్యే ఖర్చును చంద్రయాన్-3 ప్రాజెక్ట్ వ్యయంతో పోల్చారు. దీంతో సౌమ్య రంజన్ పట్నాయక్‌ను పార్టీ ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించారు.


నవీన్ పట్నాయక్ తర్వాత ఎవరు?
నవీన్ పట్నాయక్ వయసు 77 ఏళ్లు. ఆయన అవివాహితుడు అయిన కారణంగా వారసులు లేరు. ఆయన కుటుంబం నుంచి ఎవరూ పార్టీ పగ్గాలు చేపట్టరని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కొందరు మాత్రం పాండియన్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తాడని, నవీన్ పట్నాయక్ రాజకీయ వారసుడిగా సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పాండియన్ బీజేడీలో చేరారు. 


ఒడిశాలోని 30 జిల్లాల్లో పర్యటించి రాష్ట్ర ప్రజలతో మంచి సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకున్నారు. పాండియన్‌ను తదుపరి బీజేడీ చీఫ్‌గా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీకే పాండియన్ తమిళుడు అయినా ఒడిశాకు అల్లుడు అని, 20 సంవత్సరాలకు పైగా ఇక్కడ పనిచేశాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పాండియన్ చాలా మంది రాజకీయ నాయకుల కంటే ఒడియా బాగా మాట్లాడతాడని అభిప్రాయం ఉంది. అయితే ఒడిశా ప్రజలు పాండియన్ ను తమ అధినేతగా అంగీకరిస్తారా? అనే ప్రశ్నకు 2024 ఎన్నికలే సమాధానం చెప్పనున్నాయి. 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply