కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నారా.. లేకపోతే మొదట మీరు ఆ పని చేయండి. లేదంటే మరోసారి ప్రభావం చూపిస్తున్న కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మాస్కులు తప్పక ధరించాలని ప్రజలను అప్రమత్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను భారత ప్రభుత్వం అలర్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ మహమ్మారి మరోసారి  నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తంకమ్మంటోంది. ఇక కరోనా పుట్టుకకు కారణమైన చైనా.. ఇప్పుడదే వైరస్‌తో యుద్ధం చేస్తోంది. కళ్ల ముందు వేలమంది పిట్టల్లా రాలిపోతుంటే నిస్సహాయస్థితిలో నిలబడి చూస్తోంది. ఆ దేశం తయారు చేసిన వ్యాక్సిన్లలో సత్తా లేకపోవడంతో కొత్త వేరియంట్‌ ఫుట్‌బాల్ ఆడేస్తోంది.


ప్రజలు చేసుకున్న పాపమా..? పాలకుల నిర్లక్ష్యమా? అన్నది పక్కనపెడితే.. బీఎఫ్‌-7 వేరియంట్‌తో భారత్‌కు ఇబ్బందులు తప్పవా..? అన్న ప్రశ్న యావత్‌ భారతావనిని కలవరపెడుతోంది. అసలు మన వ్యాక్సిన్లలో ఉన్న దమ్మెంత అన్న క్వశ్చన్‌.. అందరి మదిలో మెదులుతుంది. కరోనాకు చెక్‌ పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త డోస్‌లను తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత్‌ బయోటెక్‌ సంస్థ కరోనా వ్యాక్సిన్‌ విషయంలో తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ముక్కు ద్వారా అందించే నాజల్‌ స్ప్రే కోవిడ్‌ వ్యాక్సిన్‌ను దేశంలో బూస్టర్‌ డోస్‌గా తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే... భారత్‌ బయోటెక్‌ సంస్థకు చెందిన బీఎఫ్‌-7 వేరియంట్‌కు బూస్టర్‌ డోస్‌ ఇంకా తయారీ క్రమంలోనే ఉందని, వచ్చే ఏడాది అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.


బీఎఫ్‌-7 వేరియంట్‌ బూస్టర్‌ డోస్‌:
బీఎఫ్‌-7 వేరియంట్‌కు చెక్‌ పెట్టేందుకు హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌, ఫైజర్‌, మోడర్నాతో పాటు పలు ప్రపంచస్థాయి కంపెనీలు పోటీ పడుతున్నాయి. డోస్‌ను అభివృద్ధి చేసి, వచ్చే ఏడాది మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నాయి. అయితే ఇప్పటి వరకు కోవిడ్‌కు మాత్రమే వ్యాక్సిన్‌ తయారు చేశాయి కంపెనీలు. కానీ ఇప్పుడు బీఎఫ్‌-7 వంటి మరిన్ని కొత్త డేంజర్‌ వేరియంట్‌లను దృష్టిలో పెట్టుకుని.. మరింత స్ట్రాంగ్‌ డోస్‌ను రెడీ చేస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ బీఎఫ్‌-7 వేరియంట్‌కు డోస్‌ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డోస్‌ ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు వ్యాక్సిన్‌ సంస్థల కన్న భారత్‌ బయోటెక్‌ సంస్థ తయారు చేయబోతున్న వ్యాక్సిన్‌కు కాస్త టైమ్‌ పట్టే ఛాన్స్‌ ఉందంటున్నారు నిఫుణులు.


ఎంతో అధ్య‌య‌నం చేసిన త‌ర్వాత కోవిడ్‌19 వ్యాధికి కచ్చితమైన కోవాగ్జిన్ టీకాను త‌యారు చేశామని, బీఎఫ్‌-7 వేరియంట్‌కు కూడా అంతే కచ్చితమైన వ్యాక్సిన్‌ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. కరోనా నియంత్రణలో భాగంగా భారత్‌ బయోటెక్ మరో టీకాను తయారు చేసింది. ఇంట్రా నాసల్ వ్యాక్సిన్ బీబీవీ154 మూడో దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమై, మార్కెట్‌లోకి వచ్చింది. ఈ నాసల్‌ పూర్తిగా సురక్షితమైనదని..వ్యాధి నిరోధక శక్తిని సమర్థంగా పెంచుతుందని తెలిపింది భారత్‌ బయోటెక్‌ సంస్థ. ముక్కు ద్వారా తీసుకునే కరోనా టీకాకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే తాజాగా దీని ధరను వెల్లడించింది భారత్‌ బయోటెక్‌ సంస్థ. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ టీకా ధర రూ.800గా పేర్కొన్నారు. దీనికి అదనంగా పన్నులు ఉంటయని, ప్రభుత్వానికి మాత్రం రూ.325 అందజేయనున్నట్టు తెలిపింది. 18 సంవత్సరాలు నిండిన వాళ్లు ఈ టీకాను బూస్టర్ డోస్‌గా వేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఇంతకుముందు కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్‌లో ఏది రెండు డోసులు వేసుకున్నా.. ఇన్ కొవాక్​ను బూస్టర్ డోస్‌గా తీసుకోవచ్చని తెలిపారు.