Parliament Monsoon Session | న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దొవల్ పార్లమెంట్‌కు చేరుకోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. బుధవారం నాడు లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై కీలక చర్చ జరుగుతోంది. మొదట ప్రతిపక్షాల ఆందోళనతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభం కాగా, యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ నడుస్తోంది. లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ పేపర్ లీక్ బిల్లుపై మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీక్ విషయంలో ఏం జరిగిందో బీజేపీ ఎంపీలు తమ పిల్లలను అడగాలన్నారు. యువత సెంటిమెంట్ ను కేంద్రం గౌరవించాలని, వారి జీవితాలను ప్రమాదంలోకి నెట్టవద్దని తన ప్రసంగంలో కేంద్రాన్ని కోరారు.
అజిత్ దోవల్ పార్లమెంట్‌కు చేరుకోగానే సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన మంత్రులకు ఏదైనా కీలకమైన భద్రతా అంశంపై సమాచారం ఇవ్వడానికి వచ్చారా లేక ఏదైనా సున్నితమైన అంశంపై కేంద్రాన్ని అలర్ట్ చేయనున్నారా అని చర్చ మొదలైంది. అయితే, ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం అజిత్ దొవల్ పార్లమెంట్‌కు రావడం పూర్తిగా రూటీన్ విజిట్ అని తెలుస్తోంది. దోవల్ పార్లమెంట్‌కు రావడానికి ఎలాంటి ప్రత్యేక భద్రతా ఇన్‌పుట్ లేదా అత్యవసర సమావేశంతో సంబంధం లేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
నేడు లోక్‌సభలో పలు కీలక బిల్లులపై చర్చ
లోక్‌సభ సవరించిన ఎజెండా ప్రకారం నేడు సభలో పలు ముఖ్యమైన బిల్లులపై చర్చించి ఆమోదింపజేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. వీటిలో యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లు, జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు, 2026తో పాటు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే సవరణ బిల్లు ఉన్నాయి.
ఆలస్యంగా నమోదు చేయడానికి కొత్త నిబంధనలు
ప్రతిపాదిత బిల్లు ప్రకారం, ఒకవేళ జననం లేదా మరణం నమోదు ఒకట్రెండుళ్లు ఆలస్యంగా జరిగితే, దానికి జిల్లా మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) లేదా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనుమతి అవసరం. మరోవైపు, నమోదు రెండేళ్లకు పైగా ఆలస్యమైతే, ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఉత్తర్వుల తర్వాతే నమోదు చేయాలి. ఈ సవరణ ద్వారా నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చని కేంద్రం భావిస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న జనన, మరణాల రికార్డులను ఒకే సెంట్రల్ డిజిటల్ డేటాబేస్‌కు అనుసంధానం చేయనున్నారు.
ఆధార్, ఓటర్ ఐడీ పాస్‌పోర్ట్‌తో లింక్
ఇందులో సెంట్రల్ డేటాబేస్‌ను ఆధార్, ఓటర్ల జాబితా, రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్ వంటి ప్రధాన ప్రభుత్వ పత్రాలతో కూడా అనుసంధానం చేస్తారు. దాంతో రికార్డుల పరిశీలన సులభతరం అవుతుంది. ప్రభుత్వ సేవలలో పారదర్శకత పెరుగుతుందని కేంద్రం చెబుతోంది. లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుపై కూడా చర్చ కొనసాగుతుంది. ప్రభుత్వం ఈ బిల్లును సభ ఆమోదంపజేయాలని ప్రయత్నిస్తుంది.
సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్యను పెంచే బిల్లు
కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచడానికి సవరణ బిల్లును సభలో ప్రవేశపెడతారు. న్యాయవ్యవస్థలో పెండింగ్‌లో ఉన్న కేసుల భారాన్ని తగ్గించడం, కేసులను వేగంగా పరిష్కరించడం లక్ష్యంగా ఈ బిల్లును కేంద్రం తీసుకోస్తుంది. కేంద్ర మంత్రి అమిత్ షా జనన మరణాల నమోదు సవరణ బిల్లును ప్రవేశపెడతారు
