లోక్‌సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఇండియాలోని పార్టీలకు విశ్వాస పరీక్షేనని ఎద్దేవా చేశారు ప్రధానమంత్రి మోదీ. 2024 జనరల్ ఎలక్షన్ల కంటే ముందే సెమీఫైనల్ చూడాలని ప్రతిపక్షాల కూటమి కోరుకుందని అభిప్రాయపడ్డారు. ఆ సెమిఫైనల్ రిజల్ట్ ఎలా ఉందో అందరూ చూశారని అన్నారు.
ఈ ఉదయం బీజేపీ పార్లమెంట్ పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ సర్వీసెస్ బిల్లు,అవిశ్వాస తీర్మానంపై జరిగిన మాటల యద్ధం, జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ మోదీ ఈ కామెంట్స్ చేశారు.
ఈ భేటీలో విపక్ష కూటమిపై ప్రధానమంత్రి మోదీ తీవ్ర విమర్శలు చేశారు. వాళ్లంతా ఒకరిపై ఒకరు అపనమ్మకంతో ఉన్నారని ఇదే వాళ్ల పతనానికి దారి తీస్తుందని జోస్యం చెప్పారు . అవిశ్వాస తీర్మానం సందర్భంగా మాట్లాడే వారి జాబితాను గుర్తు చేస్తూ వారంతా ఆఖరి బాల్‌కు సిక్స్ కొట్టాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు మోదీ.
కూటమిలోని పార్టీలకు పరీక్ష పెట్టుకునేందుకే ఈ అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తీసుకొచ్చారని మోదీ ఎద్దేవా చేశారు. ఎవరి కూటమిలో ఉన్నారో ఎవరు లేరో ఈ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా తేల్చుకుంటారని విమర్శించారు.
2018లోనే వారిపై అవిశ్వాసం ప్రకటించామన్నారు మోదీ. కూటమిని మోదీ "ఘమండియా" అని మరోసారి పిలిచారు. హిందీలో ఘమండియా అంటే అహంకారం అని అర్థం. ఆ కూటమిలోని కొందరు నేతలు చాలా అహంకారంతో ఉన్నారని, వాళ్లంతా బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నియంత్రుత్వ పోకడలను ప్రోత్సహిస్తూ ఇండియా కూటమిలో ఉన్న వాళ్లు ఇప్పుడు సామాజిక న్యాయం కోసం మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
బీజేపీకి వ్యతిరేకంగా ఏకైనా విపక్షాలు ఇండియాగా ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఆ కూటమిపై మోదీ ఎదురు దాడి చేస్తూనే ఉన్నారు. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌ను కొత్తగా బ్రాండింగ్ చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు.
దేశాభివృద్ధికి ప్రతిపక్ష కూటమి "అడ్డంకి"గా మారిందని ఇండియా అనేది అవినీతి, వారసత్వ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రానున్న సందర్భంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక కామెంట్స్ చేశారు. ఈ భేటీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపీ జేపీ నడ్డా హాజరయ్యారు.