No caste can claim ownership of a temple | చెన్నై: దేవాలయంపై తమకు యాజమాన్య హక్కులు కావాలని గానీ, దేవాలయం పాలక మండలి బాధ్యతల్ని అప్పగించాలని ఏ కులం క్లెయిమ్ చేసుకోలేదని మద్రాస్ హైకోర్టు (Madras High Court) కీలక తీర్పు వెలువరించింది. కులం (సామాజికవర్గం) ఆధారంగా ఆలయంపై హక్కులు, బాధ్యతలు ఇవ్వడం మతపరమైన ఆచారం కాదని స్పష్టం చేసింది. ఏదైనా సామాజిక వర్గం కులం పేరుతో తమ ఆచార వ్యవహారాలు కొనసాగించడానికి అర్హులు. కానీ ఒక కులానికి  హక్కులు కల్పించడం మతపరమైన విధానాలను రక్షించడం కాదని జస్టిస్ భరత చక్రవర్తి పేర్కొన్నారు. 


ఆలయాలకు దూరం చేయాలనుకోవడం సరికాదు..


కుల వివక్షను పాటించే కొందరు మతం ముసుగులో అసమానతను పెంపొందిస్తున్నారు. సమాజంలో అశాంతి, అలజడి సృష్టించేందుకు ఆలయాలను తమకు కేంద్రంగా మలుచుకునేందుకు యత్నిస్తుంటారు. మతం ముసుగులో విధ్వేషం, అలజడులు రేపడం సరికాదు. పలు ఆలయాలు ఒక నిర్దిష్ట కులానికి చెందినవని ఇప్పటికే ముద్ర వేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 ముఖ్యమైన మతపరమైన ఆచారాలను, మతపరమైన వ్యవహారాలకు సంబంధించిన  హక్కులను మాత్రమే రక్షిస్తాయి. ఏ ఒక్క సామాజిక వర్గానికి ఆలయాలపై హక్కులు, నిర్వహణ బాధ్యతలు అప్పగించడాన్ని క్లెయిమ్ చేయలేరు. మతం అనేది కేవలం ఒక సమాజిక వర్గానికి సంబంధించిన అంశం కాదు" అని కోర్టు పేర్కొంది.


పిటిషన్ కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు


అరుళ్మిఘు పొంకలిమ్మన్ ఆలయ నిర్వహణను ఇతర దేవాలయాల నుంచి వేరు చేయాలనంటూ నమోదైన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు విచారించింది. పిటిషనర్ తరఫున టీఎస్ విజయ రాఘవన్, ఈఎన్ రాజలక్ష్మీ, బి రాజీ, గోవిందస్వామి వాదనలు వినిపించగా.. దేవాదాయ శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది రవి చంద్రన్ వాదనలు వినిపించారు. అరుళ్మిఘు మరియమ్మన్, అంగళమ్మన్,  పెరుమాళ్ ఆలయాల నుంచి పొంకలిమ్మన్ ఆలయ నిర్వహణను వేరు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను కోర్టు తోసి పుచ్చింది. అరుళ్మిఘు పొంకలిమ్మన్ ఆలయ నిర్వహణను కేవలం తన సామాజిక వర్గానికి చెందిన వారే చూస్తున్నారని, ఇతర ఆలయాల నిర్వహణ బాధ్యతల్ని పలు సామాజిక వర్గాల వారు చూస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ వైఖరిని కోర్టు తప్పుపట్టింది. కులరహిత సమాజం, కుల వివక్ష లేని సమాజం నిర్మించాలని రాజ్యాంగం సూచిస్తుందని జడ్జి అన్నారు. కానీ ఓ కులానికి ఆలయంపై హక్కులు అని కోరడం ఇతర సామాజిక వర్గాల వారిని తక్కువ చేయడం, వారిపై ధ్వేషానికి దారి తీస్తుంది. ఆలయంలోకి అందరికీ ప్రవేశం ఉండాలి. అన్ని సామాజిక వర్గాల వారు దేవుళ్లను పూజించుకునే ఛాన్స్ ఇవ్వాలి. ఒకే కులానికి ఆలయాలపై హక్కులు ఉండవని దిగువ కోర్టు ఇచ్చిన ఇటీవల తీర్పును జస్టిస్ చక్రవర్తి స్వాగతించారు. 


ఓ సామాజిక వర్గం ఆధారంగా ఆలయ నిర్వహణ హక్కును క్లెయిమ్ చేయలేరని మద్రాస్ కోర్టు స్పష్టం చేసింది. కాశీ విశ్వనాథ ఆలయం వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శ్రీ ఆది విశేషేశ్వర కేసులో ఇచ్చిన తీర్పును మద్రాస్ హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. తమకు నచ్చిన విధంగా పూజించే హక్కును ఆర్టికల్ 25, 26 కల్పిస్తున్నాయి. కానీ కొందరికే దేవుడు, ఆలయాలు చెందుతాడంటూ హక్కులు కల్పించడం సరికాదని.. సామాజిక వర్గం ప్రకారం హక్కులు క్లెయిమ్ చేయలేరని తీర్పు వెలువరించారు.


Also Read: Ramzan:  రంజాన్ పండుగ ఎందుకు, ఎలా జరుపుకుంటారో మీకు తెలుసా ?