Opposition Meet:
రెండు కూటముల కసరత్తులు..
లోక్‌సభ ఎన్నికల కోసం అధికార, విపక్షాలు కసరత్తులు మొదలు పెట్టాయి. ఇప్పటికే NDA కూటమిలోని పార్టీలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్‌డీఏని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన I.N.D.I.A కూటమి కూడా అన్ని విధాలుగా ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు సార్లు ఈ కూటమికి చెందిన పార్టీల కీలక నేతలు సమావేశమయ్యారు. తొలిసారి పట్నాలో, ఆ తరవాత బెంగళూరులో భేటీ అయ్యారు. ఈ సారి ముంబయిలో సమావేశం కానున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కూటమికి పేరైతే పెట్టారు కానీ...ఇప్పటి వరకూ లీడ్ చేసేది ఎవరన్నది ప్రకటించలేదు. మొదటి నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరే వినిపిస్తోంది. ఆయనే I.N.D.I.A కూటమికి కన్వీనర్‌గా ఉంటారని చాలా మంది నేతలు చెప్పారు. దీనిపై నితీష్ కుమార్ స్పందించారు. మీడియా అడిగిన ప్రశ్నకి సమాధానమిచ్చారు. తనకు ఏ పదవిపైనా ఆసక్తి లేదని, కేవలం అన్ని పార్టీలను ఒకేతాటిపైకి తీసుకురావడమే తన లక్ష్యమని తేల్చి చెప్పారు.
"నాకు ఏ పదవిపైనా ఆసక్తి లేదు. ఇదే విషయాన్ని నేను గతంలోనూ చెప్పాను. ఇప్పుడూ చెబుతున్నాను. నాకు కన్వీనర్ పదవిపై ఏ మాత్రం ఆసక్తి లేదు. కేవలం అన్ని పార్టీలను కలపడమే నా పని. అదే నా లక్ష్యం"
- నితీష్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి
లోగో ఆవిష్కరణ..?
ముంబయిలో జరగనున్న భేటీకి తాను హాజరవుతానని, కూటమి నుంచి ఏమీ ఆశించడం లేదని స్పష్టం చేశారు. నితీష్ కుమార్ ప్రధాని అభ్యర్థి అంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఆయన గట్టిగానే స్పందించారు. అలాంటి ఉద్దేశమే లేదని తేల్చి చెప్పారు. ఆగస్టు 31న జరగనున్న విపక్ష కూటమి భేటీలోనే I.N.D.I.A లోగోని ఆవిష్కరించనున్నారు. కూటమి పేరు కలిసొచ్చేలా ఓ లోగో తయారు చేసిన్టటు సమాచారం. ఇదే సమయంలో ఈ కూటమికి సంబంధించిన కో ఆర్డినేషన్ కమిటీలోని 11 మంది సభ్యుల పేర్లనూ ఈ సమావేశంలోనే ఖరారు చేస్తారని తెలుస్తోంది. కానీ...దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. భారత దేశ స్ఫూర్తికి నిదర్శనంగా ఈ లోగో ఉండనుందని కొందరు నేతలు చెబుతున్నారు.