స్పీకర్ అంటే సీఎం ఏం చెబితే అది చేస్తారని తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు. ఎవర్ని సస్పెండ్ చేయమంటే వారిని చేస్తారు.. ఎప్పుడు వాయిదా వేయమంటే అప్పుడు వేస్తారనేది రోజూ చూస్తున్నారు. అదే సమయంలో అధికారపక్షానికి ఇబ్బంది వస్తే ఎలా డిఫెండ్ చేస్తారో కూడా చూస్తూ ఉన్నాం. కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు మాత్రం అలాంటి అదృష్టం లేదు. పైగా ఆయన స్పీకర్ విపక్షంతో కుమ్మక్కయి.. తమ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు సహకరిస్తున్నారని ఫైరయిపోయారు. అసహనంతో ఊగిపోయారు. ఈ ఘటన సోమవారం బీహార్ అసెంబ్లీలో చోటు చేసుకుంది.
బీహార్‌లో ఇటీవల జరిగిన ఓ నేర ఘటనపై అసెంబ్లీలో విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నాయి. ఆ ఘటనపై విపక్ష నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరికి చాన్స్ వస్తూనే ఉంది. ఆ విమర్శలన్నీ వింటున్న బీహార్ సీఎం నితిష్‌కుమార్‌కు మెల్లగా ఆగ్రహం పెరిగింది. అదే సమయంలో స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా ఈ వివాదంలోకి ముఖ్యమంత్రిని లాగారు. 'పోలీసులు లఖిసరాయి అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీనిపై మాకంటే సీఎంకే ఎక్కువ తెలిసి ఉంటుంది. మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను'' చెప్పడంతో నితీష్ కుమార్ స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
స్పీకర్ తీరుతో సీఎం నితీష్ కుమార్ ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. అయితే ఇలాంటి అంశాలు సభలో చర్చించడం ఏమిటని.. పోలీసులు చూసుకుంటారని స్పష్టం చేశారు. ''సభను ఇలాగే నడపాలని మీరు అనుకుంటున్నారా? ఇలాగే నడపాలని అనుకుంటే మేము సభను ముందుకు సాగనీయం. చర్చలు జరగాల్సిన తీరు ఇది కాదు'' అని నితీష్ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాపై విరుచుకపడ్డారు. ''మీరంతా కలిసే నన్ను అసెంబ్లీ స్పీకర్ చేశారు. ఇంతటి ఉన్నత స్థానంలో కూర్చున్నప్పటికీ నా ప్రాంతానికి సంబంధించిన అంశానని నేను ప్రస్తావించలేక పోతున్నాను. సభ్యులందరినికీ సమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంటుంది'' అని స్పీకర్ సమాధానం ఇచ్చినా... ముఖ్యమంత్రి వెనక్కి తగ్గలేదు.
బీహార్‌లో బీజేపీ - జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. బీజేపీకి అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ... ముఖ్యమంత్రి పదవిని జేడీయూ నేత నితీష్ కుమార్‌కు ఇచ్చారు. అయితే రెండు పార్టీల మధ్య ఇప్పుడు సఖ్యత తగ్గిపోతోంది. ముఖ్యమంత్రి పదవిని నితీష్‌కు ఇచ్చినప్పటికీ ... స్పీకర్ పదవి సహా కీలకమైన అన్ని పదవులు బీజేపీ దగ్గరే ఉన్నాయి. దీంతో నితీష్ కుమార్‌కు తరచూ చిక్కులు వచ్చి పడుతున్నాయి.