న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP) ఆదివారం నాడు అగ్రస్థాయిలో ముఖ్యమైన సంస్థాగత మార్పులు చేసింది. బిహార్ మంత్రి, ఎమ్మెల్యే నితిన్ నబిన్‌ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. దాంతో నబిన్ ప్రస్తుత పార్టీ చీఫ్ JP నడ్డా స్థానంలోకి రానున్నారు. ఈ ప్రకటన బీజేపీలో విస్తృతమైన సంస్థాగత మార్పులను సూచిస్తుంది. బిహార్‌లో వచ్చే ఎన్నికల్లో సొంతంగానే అధికారంలోకి రావాలన్న ప్లాన్ ఉందని బీజేపీ ఈ నియామకంతో చెప్పకనే చెప్పింది.
బీజేపీలో కీలక మార్పులు
బీజేపీ అధిష్టానం పంకజ్ చౌదరిని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. బిహార్‌లో PWD మంత్రి, కాయస్థ నాయకుడైన నితిన్ నబిన్ ప్రస్తుతం బిహార్‌లోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రిగా పనిచేస్తున్నారు. పాట్నాలోని బంకిపూర్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఎవరీ నితిన్ నబిన్..
దివంగత బీజేపీ నాయకుడు నబిన్ కిషోర్ సిన్హా కుమారుడైన నితిన్ నబిన్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)తో విద్యార్థి దశలోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బీజేపీ పాట్నా యూనిట్‌లో బలమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన 2000ల చివరిలో రాజకీయాల్లోకి ప్రవేశించి 2010లో తన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. అప్పటి నుండి, నబిన్ బంకిపూర్ నుండి వరుసగా తిరిగి ఎన్నికయ్యారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పాలనపై దృష్టి సారించి జనాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు.
బిహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర..
జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కులలో ఒకరైన నితిన్ నబిన్, పరిపాలనా అనుభవం, సంస్థాగత బలం రెండింటి కలయికగా పార్టీలో భావిస్తారు. సీనియర్ నాయకులు ఆయన పాలనా రికార్డు, క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తుంటారు.
బిహార్ మంత్రిగా ఉన్న నితిన్ నబీన్‌కు బీజేపీ ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించింది. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారనే వార్త రాగానే, పట్నాలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు మొదలయ్యాయి. కార్యకర్తలు భారీగా బాణాసంచా కాల్చి, డప్పుల మోతతో డ్యాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు.
బిహార్‌కు దక్కిన గౌరవంఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఒకరికొకరు లడ్డూలు, మిఠాయిలు పంచుకుని అభినందనలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పరిశ్రమల శాఖ మంత్రి డా. దిలీప్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన ఘన విజయం కారణంగా బిహార్‌కు ఈ గిఫ్ట్ లభించిందని అన్నారు. రాష్ట్రానికి ఇది చాలా గర్వకారణమని, బిహార్ నుండి ఒక నాయకుడిని జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.