న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీలకు సోవియట్ యూనియన్ నిధులు ఇచ్చిందని, వారు రష్యాకు ఏజెంట్లుగా పనిచేశారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. 2011లో అమెరికా నిఘా సంస్థ CIA విడుదల చేసిన డాక్యుమెంట్‌ను షేర్ చేసిన నిషికాంత్ దూబే కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. దివంగత కాంగ్రెస్ నేత హెచ్‌కెఎల్ భగత్ నేతృత్వంలో 150 మందికి పైగా కాంగ్రెస్ ఎంపీలకు సోవియట్ యూనియన్ ఫండ్స్ ఇచ్చిందన్నారు. దాంతో కాంగ్రెస్ ఎంపీలు రష్యాకు "ఏజెంట్లుగా" వ్యవహరించారని ఉన్న అమెరికా సంస్థ విడుదల చేసిన డాక్యుమెంట్ ను సోమవారం నిషికాంత్ దూబే షేర్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు.
"కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి మారుపేరు, బానిసత్వ పార్టీ. అమెరికా నిఘా సంస్థ CIA 2011లో కాంగ్రెస్ ఎంపీలకు సంబంధించిన ఓ డాక్యుమెంట్ విడుదల చేసింది. అందులో పేర్కొన్న దాని ప్రకారం, దివంగత కాంగ్రెస్ నేత HKL భగత్ నాయకత్వంలో 150 మందికి పైగా కాంగ్రెస్ ఎంపీలు రష్యా నుండి డబ్బులు తీసుకున్నారు. దాంతో వారు రష్యాకు ఏజెంట్లుగా వ్యవహరించారు" అని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తన ఎక్స్ ఖతాలో చేసిన పోస్ట్ దుమారం రేపుతోంది.
ఏజెంట్లుగా జర్నలిస్టులు..జర్నలిస్టుల బృందం సైతం వారి ఏజెంట్లు అని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే. తాను షేర్ చేసిన డాక్యుమెంట్ లో రష్యా ప్రచురించిన 16,000 వార్తా కథనాల జాబితా ఉందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో రష్యా నిఘా సంస్థ నుంచి 1100 మంది భారత్‌లోనే ఉన్నారు. వారు బ్యూరోక్రాట్లు, వ్యాపార సంస్థలు, కమ్యూనిస్ట్ పార్టీలు, రాజకీయ నేతలను తమ కంట్రోల్ లో ఉంచుకున్నారని ఆయన ఆరోపించారు.
సోవియట్ యూనియన్ హయాంలో ఎన్నికల పేరుతో కాంగ్రెస్ అభ్యర్థి సుభద్ర జోషి జర్మనీ ప్రభుత్వం నుండి రూ. 5 లక్షలు తీసుకున్నారు. ఓడిపోయిన తర్వాత, ఇండో-జర్మన్ ఫోరం అధ్యక్షురాలయ్యారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు.
రష్యా ప్రచురించిన 16,000 వార్తా కథనాలలో జర్నలిస్టులు వారి ఏజెంట్లుగా ఉన్నారని ప్రస్తావన ఉంది. ఆ సమయంలో రష్యా నిఘా సంస్థలకు చెందిన 1100 మంది మన దేశంలో ఉన్నారు. అధికారులు, వ్యాపార సంస్థలు, కమ్యూనిస్ట్ పార్టీలను తమ చెప్పు చేతల్లో ఉంచుకుని, భారతదేశ విధానాలను రూపొందించారు. ఆ సమయంలో ఎన్నికల పేరుతో కాంగ్రెస్ అభ్యర్థి సుభద్ర జోషి జర్మనీ ప్రభుత్వం నుండి 5 లక్షలు తీసుకున్నారు. తర్వాత ఇండో-జర్మన్ ఫోరం అధ్యక్షురాలయ్యారు. ఇది ఒక దేశమా, లేక ఏజెంట్లు, బానిసలకు నిలయమా, మధ్యవర్తుల కీలుబొమ్మనా? కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాలి. దీనిపై దర్యాప్తు జరగాలా వద్దా?" అని నిషికాంత్ దూబే తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.