Nikki Murder Case: దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా జరిగిన హత్య గురించి అందరికీ తెలిసిందే. అచ్చం శ్రద్ధా వాకర్ బాయ్ ఫ్రెండ్ తరహాలోనే మరో వ్యక్తి తన ప్రియురాలిని చంపాడు. సాహిల్ గెహ్లాట్ అనే వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలు నిక్కీ యాదవ్‌ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. ఆమెను హత్య చేసిన రెండు గంటల తర్వాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత రోజు నిక్కీ మృతదేహాన్ని పారేయడం కోసం ఫ్రిజ్ లో దాచాడని పోలీసులు చెబుతున్నారు. 


అసలేం జరిగిందంటే..?


ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 9 గంటలకు సాహిల్ గెహ్లాట్ అనే వ్యక్తి తన ప్రియురాలు నిక్కీ యాదవ్‌ను హత్య చేశాడు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు. పెళ్లి అయిన వెంటనే మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకు కారులో వచ్చి నిక్కీ మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు. సహజీవనం చేస్తున్న తన భాగస్వామిని హత్య చేయడంతో స్థానికంగా సంచలనం రేగింది. 


పోలీసులు ఏం చేస్తున్నారు..?


ఈ హత్య గురించి సాహిల్ గెహ్లాట్ కుటుంబ సభ్యులకు ఏమైనా అవగాహన ఉందా అనే కోణంలో ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. హత్య విషయం ఆయన కుటుంబ సభ్యులకు తెలుసేమోనని భావిస్తున్నారు. విచారణలో పాల్గొన్న ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. ఫిబ్రవరి 10వ తేదీన ఉదయం 9 గంటల సమయంలో యాదవ్‌ను మొబైల్ డేటా కేబుల్‌తో గొంతుకోసి చంపినట్లు నిందితుడు సాహిల్ గెహ్లాట్ ఒప్పుకున్నట్లు వివరించారు. పోలీసుల ముందు తాను చేసిన నేరాన్ని అంగీకరించి.. నిక్కీ మృతదేహానికి సీటు బెల్ట్‌తో కట్టి, ఉదయం 11 గంటలకు ధాబాకు చేరుకున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని కారులో ఉంచి, తన దాబా పార్కింగ్ స్థలంలో కారును నిలిపాడని.. ఆపై దాబాలోకి ఎవరూ వెళ్లకుండా బయటి నుంచి తాళం వేసి దాబాను కూడా మూసేసి ఇంటికి చేరుకున్నట్లు వెల్లడించారు. కారును, మృతదేహాన్ని దాబాలో దాచి పెట్టి ఇంటికి చేరుకుని పెళ్లికి సిద్ధమై సాయంత్రం మండోతి గ్రామానికి చేరుకుని బంధువులతో కలిసి మరో అమ్మాయిని ఆడంబరంగా పెళ్లి చేసుకున్నట్లు గెహ్లాట్‌ విచారణ అధికారులతో చెప్పినట్లు స్పష్టం చేశారు. వివాహం జరిగిన తర్వాత అంటే ఫిబ్రవరి 11వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కొత్తగా పెళ్లయిన భార్యతో కలిసి తన గ్రామానికి తిరిగి వచ్చాడు.


మరో అధికారి ఏమన్నారంటే..?


ఈ కేసులో రెండో దర్యాప్తు అధికారి మాట్లాడుతూ.. గెహ్లట్ పెళ్లి సందర్భంగా ఆయన ఇంట్లో చాలా మంది బంధువులు, స్నేహితులు ఉన్నారు. ఈ సమయంలోనే ఆయన రెండో కారు(టాటా నెక్సాన్)లో దాబాకు బయలుదేరారు. తెల్లవారుజామున 3.30 గంటల యాదవ్ మృతదేహాన్ని కారులోంచి బయటకు తీసి ఫ్రిజ్ లో ఉంచాడు. అయితే నిక్కీని చంపినప్పటి నుంచి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అతడి దగ్గరే ఉంచుకున్నాడు. అలాగే ఆ ఫోన్ లో తనతో ఉన్న చాట్ మొత్తాన్ని డిలీట్ చేశాడు. ఫోన్ కాల్స్ చేసిన హిస్టరీని కూడా తొలగించాడు. అయితే గెహ్లట్ ను దోషిగా నిర్ధారించేందుకు కావాల్సిన అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ కమిషనర్ రవీంద్ర యాదవ్ తెలిపారు. విచారణలో తాను వెల్లడించిన విషయాలన్నీ శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో సహా ప్రూవ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోర్టు నుంచి సాహిల్‌ను పోలీసులు 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు.


నిక్కీ సోదరి వాంగ్మూలం తీసుకోనున్న పోలీసులు..


నిక్కీ యాదవ్ తన సోదరితో కలిసి ఉత్తమ్ నగర్‌లోని అద్దె ఇంట్లో నివసించేవారు. అయితే ఫిబ్రవరి 10వ తేదీ తెల్లవారుజామున 1.30 గంటలకు గెహ్లాట్‌తో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లడాన్ని ఆమె సోదరి చివరి సారిగా చూసిందని ఢిల్లీ పోలీసుల దర్యాప్తు అధికారులు తెలిపారు. నిక్కీ సోదరితో పాటు, ఢిల్లీ పోలీసులు మరో ముగ్గురు వ్యక్తుల వాంగ్మూలాలను కూడా తీసుకోనున్నారు. వారిలో ఒకరు నిక్కీ సోదరి నిశ్చితార్థం గురించి సమాచారం ఇచ్చారు. ఇది కాకుండా యాదవ్‌తో అతని సహజీవనం గురించి గెహ్లాట్ కుటుంబానికి తెలుసా అనే విషయాన్ని కూడా పోలీసులు విచారించనున్నారు.


నిక్కీని ఎలా హత్య చేశాడంటే..?


తనను పెళ్లి చేసుకోకపోతే చట్టపరమైన కేసుల్లో ఇరికిస్తానని నిక్కీ బెదిరించడంతో.. భయపడిపోయిన గెహ్లాట్ మొబైల్ కేబుల్‌తో గొంతునులిమి చంపేసినట్లు విచారణ అధికారులు తెలిపారు. అయితే ముందుగా నిక్కీ బాగా ఒత్తిడి చేయడంతో ఇద్దరూ కలిసి పారిపోవాలని భావించినప్పిటీ.. పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో అతను మనసు మార్చుకున్నాడు. ఆపై అతడిని హత్య చేశాడు.