IRCTC New Website: ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థను ఆధునీకరించే దిశగా భారతీయ రైల్వే ఒక కీలక అడుగు వేసింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తన కొత్త వెబ్‌సైట్  బీటా వెర్షన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బీటా వెర్షన్ ద్వారా, ప్రయాణికులు వెబ్‌సైట్  కొత్త డిజైన్, ఫీచర్లు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను కలిగిస్తాయి.  

Continues below advertisement

కొత్త వెబ్‌సైట్ బీటా వెర్షన్ https://www.irctc.co.in/eticket/ లో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత IRCTC వెబ్‌సైట్ హోమ్‌పేజీలో కూడా బీటా వెర్షన్‌కు లింక్ అందించారు. 

MNIT విద్యార్థుల సూచనలతో కొత్త వెబ్‌సైట్ అభివృద్ధి 

రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం, వెబ్‌సైట్‌కు చేసిన అనేక కీలక అప్‌డేట్స్‌ జైపూర్‌లోని MNIT విద్యార్థుల సూచనల ఆధారంగా జరిగాయి. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో జరిగిన చర్చలో వారు ఇచ్చిన సూచనల మేరకు, వెబ్‌సైట్ డిజైన్, వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరిచే ప్రక్రియలో విద్యార్థులను భాగస్వాములను చేశారు.

Continues below advertisement

IRCTC ప్రస్తుత వెబ్‌సైట్ 2002 సంవత్సరంలో ప్రారంభించారు. ప్రస్తుతం దానిపై ప్రతిరోజూ సగటున సుమారు 14.5 లక్షల టిక్కెట్లు బుక్ అవుతున్నాయి.  

కొత్త వెబ్‌సైట్‌లో ప్రత్యేకత ఏంటి?

  • కొత్త వెబ్‌సైట్‌ మరింత సరళంగా, వేగవంతంగా, వినియోగదారునికి అనుకూలంగా రూపొందించారు. బీటా వెర్షన్‌లో నాలుగు ప్రధాన మార్పులు ఉన్నాయి.
  • మెరుగైన ఇంటర్‌ఫేస్: అనవసరమైన క్యాప్చాలు, పాప్-అప్‌లు, కలర్‌ఫుల్ గ్రాఫిక్స్, దృష్టిని మరల్చే వాటిని తొలగించారు. 
  • వివిధ తరగతుల్లో సీట్ల లభ్యత: ప్రయాణీకులు ఒకే స్క్రీన్‌పై వివిధ క్లాస్‌లలో ఉన్న సీట్ల లభ్యత చూసుకోవచ్చు. 
  • వేగవంతమైన టికెట్ బుకింగ్: టికెట్ బుకింగ్ ప్రక్రియలోని దశల సంఖ్యను కూడా తగ్గించడం వల్ల, చెక్అవుట్ మునుపటి కంటే వేగవంతమైంది.
  • సులభమైన రీ-బుకింగ్: ప్రయాణీకుల సేవ్ చేసిన వివరాలు ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి, దీనివల్ల వివరాలను మళ్లీ మళ్లీ నమోదు చేయవలసిన అవసరం ఉండదు.

ప్రయాణికుల నుంచి సూచనలు, అభిప్రాయాలు సేకరించి, తద్వారా తుది వెర్షన్‌ను మరింత మెరుగుపరచడమే బీటా వెర్షన్ ఉద్దేశ్యమని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే, ప్రయాణికుల నుంచి అందిన సూచనల ఆధారంగా భవిష్యత్తులో వెబ్‌సైట్‌కు అప్‌డేట్‌లు కూడా చేస్తామని, దీనివల్ల వినియోగదారుల అనుభవం మెరుగుపడుతుందని పేర్కొంది.

కొత్త ప్రయాణీకుల రిజర్వేషన్ ఇంజిన్ త్వరలో రానుంది

ఇది కాకుండా, రైల్వే తన ప్యాసింజర్ రిజర్వేషన్ ఇంజిన్ (PRE)ను కూడా అప్‌డేట్ చేస్తోంది. ఎందుకంటే ఈ వ్యవస్థ వివిధ రైలు టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లను నిర్వహిస్తుంది. ఇది కూడా త్వరలో అందుబాటులోకి రానుంది.  

కొత్త IRCTC వెబ్‌సైట్, కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ ఇంజిన్ పూర్తిగా లింక్ అయిన తర్వాత, ప్రయాణికులు వేగవంతమైన, సులభమైన, మరింత ఆధునికమైన ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందుతారని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. పూర్తిస్థాయిలో పనిచేసే కొత్త IRCTC పోర్టల్ రాబోయే కొద్ది వారాల్లో అందుబాటులోకి వస్తుంది. వినియోగదారులందరూ కొత్త వెబ్‌సైట్‌ను ఉపయోగించి, తమ సూచనలను పంచుకోవాలని రైల్వే కోరింది.