PM Modi on NEET Paper Leak | న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో దేశవ్యాప్తంగా ఈ అంశం హాట్ టాపిక్ యింది. ముఖ్యంగా దేశ రాజకీయాలు సైతం దీని చుట్టే తిరుగుతున్నాయి. పార్లమెంటులోనూ నీట్ పేపర్ లీక్‌పై చర్చ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వాంగ్ చుక్ దీక్ష కొనసాగుతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగి లీకేజీలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
యువత భవిష్యత్తును కాలరాసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, అందుకోసం పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా బిల్లు తెస్తున్నట్లు గురువారం అర్ధరాత్రి ఓ వీడియోలో తెలిపారు. పేపర్ లీక్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు నరకప్రాయంగా ఉంటుందని, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రీఎగ్జామ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సమస్యపై ఫాస్ట్ కోర్ట్ ఏర్పాటు చేసి విచారణ జరుపుతామని అంతకుముందే మోదీ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఓ ఫాస్ట్ ట్రాక్ కోర్టును సైతం నోటిఫై చేసింది. మరోవైపు, ఈ అంశంపై 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ గురువారం అర్ధరాత్రి దీక్ష విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు హాస్పిటల్‌కు వెళ్లి కేంద్రం తీసుకుంటున్న చర్యలను, ప్రధాని మోదీ ప్రకటనను వివరించి, విజ్ఞప్తి మేరకు మేదాంత ఆసుపత్రిలో తన దీక్షను విరమించి నిమ్మరసం తాగారు. దేశంలో హింస చెలరేగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాంగ్‌చుక్ తెలిపారు. కేంద్రం తమ డిమాండ్లు, సమస్యలపై చర్చలు జరపాలని కోరారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ లీకేజీ కేసులపై వేగవంతమైన విచారణ జరిపేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రాంగణంలో స్పెషల్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టును నోటిఫై చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కోర్టుకు న్యాయాధికారిగా జస్టిస్ అను గ్రోవర్‌ను నియమించారు. దీంతో పాటు విద్యాశాఖలో ప్రక్షాళన చేపడుతూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేసి, ఆయన స్థానంలో నరేశ్ గంగ్వార్‌ను నియమించారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా టీకే అనిల్ కుమార్‌ను నియమించారు. వినీత్ జోషి గతంలో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్‌గా, సీబీఎస్ఈ చైర్మన్‌గా వ్యవహరించారని తెలిసిందే.
శుక్రవారం మధ్యాహ్నం సీజేపీ నేతలతో కేంద్రం చర్చలు
నీట్ సహా ఇతర ఎగ్జామ్ పేపర్ల లీక్, సీబీఎస్ఈ ఎగ్జామ్ నిర్వహణలో లోపాలు జరిగాయని ఆరోపిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. ప్రధాని హామీని, జేపీ నడ్డా ఆహ్వానాన్ని తిరస్కరించిన సీజేపీ నాయకులు.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోదీ చేసిన ప్రకటనలతో దిగొచ్చిన సీజేపీ నేతలు శుక్రవారం మధ్యాహ్నం ఒక తటస్థ వేదికపై కేంద్ర మంత్రులతో చర్చలు జరిపేందుకు అంగీకరించారు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు, జిల్లా కేంద్రాల్లో నిరసనలకు సీజేపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కొందరు మద్దతు తెలిపారు. విద్యార్థుల జీవితాలు ముఖ్యమని, చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
మరోవైపు, ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు రాహుల్ గాంధీ నివాసంలో సమావేశమై తమ తదుపరి ప్లాన్ రెడీ చేసుకున్నారు. అనంతరం వారు పాదయాత్రగా హోం మంత్రి అమిత్ షా ఇంటి వైపు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నీట్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు గాంధీ స్మృతి వద్ద నివాళులర్పించారు. మహారాష్ట్రలోని అహిల్యానగర్‌లో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే కూడా విద్యార్థులకు మద్దతుగా 2 గంటల పాటు మౌన దీక్ష చేపట్టారు. ఓవైపు సోనమ్ వాంగ్ చుక్ దీక్ష విరమించడం, మరోవైపు సీజేపీ నేతలతో కేంద్రం చర్చలు జరపనుండటం శుభపరిణామంగా చెప్పవచ్చు.
