న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బీజేపీ నేతృత్వంలోని NDA పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చాలా కాలం తర్వాత అధికార కూటమి ఎంపీల సమావేశం జరుగుతోంది. ఆగస్టు 7న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో NDA ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఆగస్టు 21 నాటికి NDA తన అభ్యర్థిని ప్రకటించనుంది. కూటమికి మెజారిటీ ఉండటంతో విజయం ఖాయంగా కనిపిస్తోంది.

హరహర మహాదేవ్ నినాదాలు..

ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ లాంటి కేంద్రం చేపట్టిన రెండు ఆపరేషన్లు విజయవంతం అయిన తర్వాత నేడు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం అయింది. అయితే ఈ సమాశానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బీజేపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. 'హర్ హర్ మహాదేవ్' అంటూ నినాదాల మధ్య పూలమాల వేసి చప్పట్లతో ఆయనను అభినందించారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ ప్రధానమంత్రిని పహల్గాం ఉగ్రదాడిపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సైనిక చర్యకుపై సత్కరించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఎలక్టోరల్ కాలేజీలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఉంటారు. ప్రస్తుతం వీరి సంఖ్య 782. ప్రతిపక్షాలు ఒక అభ్యర్థి పేరును ప్రకటిస్తే, ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరిగే అవకాశం ఉంది.

ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో, పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎంపీలు నివాళులు అర్పించారు. దీనితో పాటు భారత సైన్యం పరాక్రమం, వారి ధైర్యసాహసాలను ఈ సందర్భంగా ఎంపీలు కొనియాడారు. పాకిస్తాన్‌ వక్రబుద్ధిని ప్రపంచ వ్యాప్తంగా బయటపెట్టడానికి పంపిన ప్రతినిధి బృందంపై కూడా ఒక ప్రతిపాదన ఆమోదించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. ఉజ్వల్ నికం, సి సదానంద్ మాస్టర్, హర్షవర్ధన్ శ్రింగ్లా వంటి కొత్త సభ్యులను పరిచయం చేశారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు పార్లమెంటు బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరయ్యారు. ఆపరేషన్ సిందూర్ కోసం ప్రధాన మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీలు అభినందించారు. ఆపరేషన్ సిందూర్ గురించి కూడా ఒక ప్రతిపాదన ఆమోదించినట్లు తెలుస్తోంది. దేశ సైన్యం గౌరవం,  ధైర్యసాహసాలు గురించి చర్చించనున్నారు. ఈ కీలక సమావేశంలో భారత్ మాతా కీ జై, హర హర మహాదేవ్ అని ఎన్డీయే ఎంపీలు నినాదాలు చేశారు.

ఎన్డీయే మిత్రపక్షాల హాజరుగత లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు. మిత్రపక్షాల సహకారంతో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అప్పటినుండి పార్టీ ఎంపీల సమావేశాలలో మిత్రపక్షాలైన ఏపీ, బిహార్ లోని తమ ఎంపీలకు మోదీ ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో జూలై 2న ఎన్డీయే ఎంపీల సమావేశం నిర్వహించిన ఏడాది తరువాత జరుగుతున్న భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 

పార్లమెంటరీ సమావేశం, ప్రతిపక్షాల నిరసనపార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలోనే ఎన్డీఏ ఎంపీల సమావేశం జరుగుతోంది. మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో  పహల్గాం దాడి, ‘ఆపరేషన్ సింధూర్’పై రెండు రోజుల ప్రత్యేక చర్చ జరిగింది. ప్రతిపక్షాలు బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పునఃపరిశీలన (SIR)కు వ్యతిరేకంగా లోక్‌సభ, రాజ్యసభలో నిరసనలు తెలిపారు.