India exports to US: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా పలు దేశాలపై టారిఫ్‌లు విధించారు. ఇటీవల భారతదేశంపై 25 శాతం సుంకం విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ట్రంప్ నిర్ణయం అమెరికాకే నష్టాన్ని కలిగిస్తున్నట్లు నివేదిక చెబుతోంది. థింక్ ట్యాంక్ GTRI సోమవారం వెల్లడించిన తన నివేదికలో, భారతదేశంపై టారిఫ్ విధించడం వల్ల 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ నుంచి ఎగుమతులు 30 శాతం వరకు తగ్గుతాయని, ఇది 60.6 బిలియన్ అమెరికన్ డాలర్లు అవుతుందని పేర్కొంది.

ఇతర ఆసియా దేశాల కంటే భారత్‌పై అధికం 

అమెరికా భారతదేశంపై విధించిన 25 శాతం సుంకాలు ఇతర ఆసియా దేశాల కంటే ఎక్కువ అని చెప్పవచ్చు. కేవలం తనను విభేదించే, తనతో గిల్లిగజ్జాలు పెట్టుకున్న చైనాపై విధించిన 30 శాతం సుంకం తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే వియత్నాం (20 శాతం), బంగ్లాదేశ్ (18 శాతం), ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ దేశాలపై 19 శాతం.. జపాన్, దక్షిణ కొరియా (15 శాతం) వంటి ఇతర ఆసియా దేశాలలో కంటే భారతదేశం కంటే తక్కువ సుంకం విధించిన విషయాన్ని ప్రజలు, ప్రభుత్వాలు గమనిస్తున్నాయి.

ఎగుమతులను ప్రోత్సహించవచ్చు

నివేదికలో ఎగుమతులను ప్రోత్సహించడానికి, అమెరికా ప్రభుత్వం హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయడం, వాణిజ్య ఒప్పందాలను వ్యూహాత్మకంగా చేయాలని సూచించింది. కొత్త ఎగుమతిదారులను చేర్చుకోవడంతో పాటు వడ్డీ రేట్లు సమానీకరణ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని ఆ సర్వే రిపోర్ట్ సూచించింది. ఇది ఎగుమతిదారులకు ఎగుమతికి ముందు, తరువాత రూపాయి ఎగుమతి రుణాలపై సబ్సిడీలను అందిస్తుంది. ఏప్రిల్ 1, 2015న ఈ పథకం ప్రారంభమైంది. కానీ సరగ్గా కొనసాగిస్తేనే ప్రయోజనం ఉంటుందని అమెరికాకు సూచించింది..

ఒత్తిడిలో భారతదేశంలోని చాలా రంగాలు

గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) ప్రకారం, భారతదేశంలోని చాలా రంగాల ఎగుమతులు దెబ్బతినే అవకాశం ఉంది. అమెరికా ప్రస్తుతం ఫార్మాస్యూటికల్స్, ఎనర్జీ ఉత్పత్తులు, సెమీకండక్టర్లపై ఎలాంటి సుంకాలు విధించలేదు. కొన్ని మినహాయింపులను మినహాయిస్తే, ఇతర భారతీయ వస్తువులపై ఒత్తిడి కొనసాగుతుంది.

ఫలితంగా అమెరికాకు భారతదేశం నుంచి ఎగుమతులు భారీగా తగ్గుతాయి. ప్రస్తుతం ఇది అతిపెద్ద ఎగుమతి మార్కెట్ అయిన అమెరికాకు  దాదాపు 30 శాతం తగ్గి, ఆర్థిక సంవత్సరం 2024-25లో 86.5 బిలియన్ అమెరికన్ డాలర్ల నుండి ఆర్థిక సంవత్సరం 2025-2026లో దాదాపు 60.6 బిలియన్ అమెరికన్ డాలర్లకు తగ్గుతుందని అంచనా వేసింది. దీని వల్ల పాకిస్తాన్, వియత్నాం వంటి పలు దేశాలు ప్రయోజనం పొందుతాయని జీటీఆర్ఐ అభిప్రాయపడింది.