NBDA BANS all panelists from Pakistan | న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ మీడియా భారత్ గురించి, కేంద్ర ప్రభుత్వం గురించి తమకు ఇష్టం వచ్చినట్లు అసత్యాలు ప్రచారం చేస్తోంది. మరోవైపు కొందరు ప్యానెల్ మెంబర్లు సైతం భారత న్యూస్ డిబేట్స్‌లో పాక్ అనుకూల కామెంట్లు చేయడాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ గుర్తించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ఎలాంటి ప్యానెల్ మెంబర్లు మన దేశంలో నిర్వహించే న్యూస్ డిబెట్స్‌కు ఆహ్వానించకుండా నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

పాక్ స్పీకర్లు, ప్యానలిస్టులపై నిషేధం

పాకిస్తాన్ నుంచి మన దేశానికి వచ్చి, భారతదేశానికి వ్యతిరేకంగా న్యూస్ డిబేట్స్ లో తప్పుడు ప్రచారం చేసే వారిని ఆహ్వానించకూడదని న్యూస్ ఛానల్స్‌కు సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ సూచించింది. NBDA ఎడిటర్లు తమ కార్యక్రమాల్లో పాకిస్తాన్ నుండి ఎలాంటి ప్యానెలిస్టులు, స్పీకర్లు, వ్యాఖ్యాతలను ఆహ్వానించకుండా ఉండాలని సూచించారు.  పాక్ నుంచి వచ్చి కొందరు స్వేచ్ఛగా భారత్‌కు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం మన సౌర్వభౌమత్వాన్ని దెబ్బతీయడమేనని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

భారత సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా కామెంట్స్

పాక్ నుంచి వచ్చే వ్యాఖ్యాతలు, ప్యానలిస్టులు మన దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతిసేలా కామెంట్లు చేస్తున్నారని గుర్తించాం. ఇకనుంచి అలా జరగకుండా ఉండాలంటే భారత న్యూస్ ఛానెల్స్ చర్చ కార్యక్రమాల్లో పాకిస్తాన్  నుంచి ఎవర్నీ ఆహ్వానించకుండా నిషేధం విధించారు. ఈ మేరకు న్యూస్ ఛానల్ ఎడిటర్స్, ప్యానెల్ స్పీకర్లు. తమ సంపాదకీయ విచక్షణను ఉపయోగించాలని ఎన్‌బీడీఏ సూచించింది. ఈ మేరకు న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అన్నీ జోసెఫ్ ఓ ప్రకటన విడుదల చేశారు.