Muzaffarpur Hospital Fire: ఢిల్లీ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగిన మరుసటి రోజే, బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం (జూన్ 4వ తేదీ) తెల్లవారుజామున 3:00 గంటల ప్రాంతంలో, ముజఫర్‌పూర్‌లోని అతిపెద్ద ఆసుపత్రి అయిన ప్రసాద్ హాస్పిటల్ ఐసీయూలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటలో పలువురు రోగులు మృతి చెందారు. ఐసీయూలో 15 పడకలు ఉన్నాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
అగ్నిప్రమాదం తర్వాత ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. దీనికే ఎక్కువ మంది రోగులు మృతి చెందినట్టు తెలుస్తోంది. 15 మందిని సిబ్బంది రక్షించగా, వారిలో ముగ్గురు మరణించినట్లు నిర్ధారించారు. మిగిలిన 12 మంది రోగులను చికిత్స కోసం మరో ఆసుపత్రిలో చేర్చారు.
నివేదికల ప్రకారం, ఇప్పటివరకు ముగ్గురు రోగులు మరణించారు. 15 మంది రోగులను ఐసీయూలో చేర్చగా, వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం
ప్రారంభంలో, ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ భారీ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అక్కడున్న వారి సహాయంతో లోపల చిక్కుకున్న రోగులను రక్షించారు. సురక్షితంగా బయటపడ్డ వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అగ్నిమాపక శాఖ అధికారులు ఏం చెప్పారు?
ప్రసాద్ ఆసుపత్రిలోని ఐసీయూలో అగ్నిప్రమాదం జరిగినట్లు తెల్లవారుజామున 3:55 గంటల ప్రాంతంలో తమకు సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ ఉద్యోగి ఒకరు తెలిపారు. వెంటనే ఆరు అగ్నిమాపక వాహనాలను ఘటనా స్థలానికి పంపించారు. పన్నెండు మందిని రక్షించగా, ముగ్గురు రోగులు మరణించారు.
ఇంతలో, ఐసియులో రోగుల కోసం 13 పడకలు ఉన్నాయని, అదనంగా మరో రెండు పడకలు ఏర్పాటు చేశారని ఒక పోలీసు అధికారి తెలిపారు. అక్కడ ఆక్సిజన్ సిలిండర్లు, హార్ట్ మానిటర్లు, ఇతర పరికరాలతో సహా అనేక యంత్రాలు ఉన్నాయి. ఈ యంత్రాలలో ఒకదానిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పొగ వ్యాపించడంతో, రోగుల పరిస్థితి మరింత విషమించింది. సహాయక చర్యలు పూర్తయ్యాయి, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది.
పట్టించుకోని ఆసుపత్రి యాజమాన్యం
ఘటనా స్థలంలో ఆసుపత్రి యాజమాన్యానికి సంబంధించిన వారెవరూ కనిపించలేదని కూడా వార్తలు వస్తున్నాయి. ఏబీపీ న్యూస్ విలేకరులు ఆసుపత్రికి చేరుకున్నప్పుడు, యాజమాన్యం నుంచి ఎవరూ మాట్లాడటానికి ముందుకు రాలేదు. ఈలోగా, అక్కడున్న భద్రతా సిబ్బంది తమను గుర్తుపట్టకుండా ఉండేందుకు యూనిఫామ్‌లు తీసేసి, జాకెట్లు ధరించి తిరిగారు.
