కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ సోషల్ మీడియాలో ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ మహువా మెయిత్రా పుట్టిన రోజు వేడుకలో దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేయడంపై మండిపడ్డారు. ఆమె జన్మదిన వేడుకల్లో తన సోదరితో పాటు మరో 15 పాల్గొన్నారని వెల్లడించారు. కొందరు దురుద్దేశ పూర్వకంగా పార్టీకి వచ్చిన వారందర్ని తొలగించి, అదేదో ప్రైవేటు సమావేశంగా ఫోటోలను మార్చారని అన్నారు. మహువా మెయిత్రా తన కంటే 10 నుంచి 20 ఏళ్లు చిన్నదని, చిన్నపిల్లలా కనిపిస్తుందన్నారు. ఫోటోలతో కొందరు నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెల్లటి బ్లౌజ్ కంటే గ్రీన్ డ్రెస్ ఇష్టమన్న మహువా
బర్త్ డే ఫోటోలు సోషల్ మీడియా మార్ఫింగ్ చేయడంపై ఎంపీ మహువా మెయిత్రా, తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. @BJP4India ట్రోల్ సేన ద్వారా సోషల్ మీడియాలో తన వ్యక్తిగత ఫోటోలు ప్రసారం చేయడం చూసి చాలా సంతోషించానన్నారు. తనకు తెల్లటి బ్లౌజ్ కంటే గ్రీన్ డ్రెస్ బాగా ఇష్టమన్నారు. ఎందుకు క్రాపింగ్ ఇబ్బంది, రాత్రి భోజనంలో పాల్గొన్న మిగిలిన వారిని కూడా చూపించాలంటూ ట్రోలర్లకు కౌంటర్ ఇచ్చారు. బెంగాల్ మహిళలు స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతున్నారని స్పష్టం చేశారు. తాను పొగ త్రాగనని, సిగరెట్లంటే తనకు తీవ్ర అలర్జీ అని, స్నేహితుడి సిగార్‌తో జోక్ కోసం పోజులిచ్చినట్లు ట్వీట్ చేశారు. పార్లమెంట్ లో తన ప్రసంగాలతో లోక్‌సభలో అధికార పక్షాన్ని ఇరుకున పెడుతున్నారు మహువా మెయిత్రా. దీన్ని సహించలేని బీజేపీ సోషల్ మీడియా ఫోటోలను క్రాప్ చేసి తప్పుడు ప్రచారం చేస్తోందని టీఎంసీ నేతలు మండిపడుతున్నారు.