Viral News: ఉత్తర్‌ప్రదేశ్‌లో చెట్టుపై నుంచి నోట్ల వర్షం కురిసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారుతోంది. ఔరయ్య జిల్లాలో బిధున రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. అనుజ్‌ కుమార్‌ తన తండ్రితో కలిసి రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు వచ్చారు. బ్యాగ్‌తో తీసుకొచ్చిన డబ్బులను వాహనంలో పెట్టి పేపర్ పని మొదలు పెట్టారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు కావాల్సిన పేపర్ వర్క్ చేస్తున్న టైంలో అటుగా వచ్చిన కోతీ వారి క్యాష్ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిపోయింది. 

పక్కనే ఉన్న అనుజ్ కుమార్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కోతిని వెంబడించే సరికి అది పక్కనే ఉన్న చెట్టుపైకి ఎక్కింది. అక్కడికి ఎక్కిన కోతి సంచిలో తినడానికి ఏమైనా ఉందేమో అని చించేసింది. దీంతో అందులో ఉన్న కరెన్సీ నోట్లు కిందడపడటం ప్రారంభమయ్యాయి. చెట్టుపై నుంచి నోట్లు పడుతున్న సంగతి తెలుసుకున్న జనాలు ఒక్కసారిగా అక్కడకు పోగయ్యారు. పడుతున్న నోట్ల ఏరుకోవడం ప్రారంభించారు. 

అది భూమి రిజిస్ట్రేషన్ కోసం తెచ్చుకున్నామని అనుజ్ కుమార్ చెబుతున్నా వినే వాళ్లు లేరు. ఆయనతో వచ్చి తండ్రి కోతి చేతిలో ఉన్న బ్యాగ్‌ను విడిపించేందుకు ప్రయత్నిస్తుంటే... అనుజ్‌ మాత్రం కిందపడిన డబ్బులు ఏరుకోవడం ప్రారంభించాడు. మొత్తానికి బ్యాగ్‌లో ఏం లేదని గ్రహించిన కోతి ఆ బ్యాగ్‌ను కిందపడేసింది. అలా బ్యాగ్‌ను దక్కించుకున్నాడు అనుజ్. 

అయితే భూమి రిజిస్ట్రేషన్ కోసం దాదాపు ఎనభై వేలు తీసుకొచ్చారు. కానీ ఆ డబ్బు బ్యాగ్‌ను కోతి ఎత్తుకెళ్లి చించేసి నోట్లను కిందపడేసింది. కొందర్ని రిక్వస్ట్ చేసి పడిన నోట్లను ఏరే ప్రయత్నం చేశారు. మరికొందరు సైలెంట్‌గా కోతి జారవిడిచిన నోట్లను జేబులో వేసుకొని వెళ్లిపోయారు. ఇలా చేయడంతో దాదాపు 28వేల వరకు నష్టపోయారు. కేవలం వారికి 52 వేలు మాత్రమే దక్కింది. 

చెట్టుపైకి ఎక్కిన కోతి నోట్లు జార విడిచే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ప్రభుత్వ ఆఫీస్‌లో జరిగిందని అందుకే ప్రభుత్వంపరిహారం ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.