Modi US Visit 2023: అమెరికా అధ్యక్షుడి ఆహ్వానంతో వైట్ హౌస్ లోకి ప్రవేశించిన ప్రధాని మోదీ.. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌కు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. మొత్తం భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా అన్ని రాష్ట్రాల సంస్కృతిని కళ్లకు కట్టేలా ఓ విలువైన గంధపుచెక్క పెట్టెను మోదీ అమెరికా అధ్యక్షుడికి బహుకరించారు. రాజస్థాన్ లో నైపుణ్యం కలిగిన నగిషీలు చెక్కే కళాకారులతో తీర్చిదిద్దిన ఈ గంధపు చెక్కెపెట్టెలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ బాక్సులో 'సహస్ర చంద్ర దర్శనం' అని రాసి ఉంచిన కార్డును కూడా ఉంచారు. 






ఈ గంధపు చెక్కను కర్ణాటకలోని మైసూరు నుంచి తెప్పించారు. ఈ పెట్టెలో ఓ వినాయకుడి చిన్నివిగ్రహాన్ని ఉంచారు. వినాయకుడు సర్వ విఘ్నాలను తొలగిస్తాడని భారతీయుల నమ్మకమని మోదీ అమెరికా అధ్యక్షుడికి వివరించారు. ఈ విగ్రహాన్ని కోల్ కతాకు చెందిన స్వర్ణకారులు తయారు చేశారు. ఈ పెట్టెలో ఓ దీపపు కుందెను ఉంచారు. హిందూ సంప్రదాయాల్లో దీపానికి ప్రత్యేక స్థానం ఉంది. వెండితో తయారు చేసిన ఈ దీపపు కుందెను కూడా బెంగాల్ లోనే తయారు చేయించారు. 






వెయ్యి పున్నములు చూసిన దంపతులకు దశదానం చేసే సంప్రదాయం భారతదేశంలో ఉంది. అందుకే పది దానాలను మోదీ అమెరికా అధ్యక్ష దంపతులకు చేశారు. గోదానంగా చిన్న వెండి కొబ్బరికాయను, భూదానంగా మైసూరు నుంచి తీసుకు వచ్చిన గంధపుచెక్కను, తిలాదానంగా తెల్లనువ్వులు, హిరణ్యదానంగా బంగారు కాసు, అజ్య దానంగా నెయ్యి, ధాన్య దానంగా బియ్యంగింజలు, వస్త్రదానంగా బట్టలను, బెల్లాన్ని, వెండి నాణేన్ని, ఉప్పును ఈ పెట్టెలో ఉంచారు. 


ఇలా దానంగా ఇచ్చిన వస్తువులను కూడా వేర్వేరు రాష్ట్రాల నుంచి తెప్పించి వాటిని బైడెన్‌కు అందజేశారు. నువ్వులను తమిళనాడు నుంచి, బంగారు కాసును రాజస్థాన్ నుంచి, ఉప్పను గుజరాత్ నుంచి తెప్పించారు. ఈ పెట్టెను, ఇందులో వస్తువులను వివరాలను మోదీ సవివరంగా చెప్పటంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్ ఆశ్చర్యానికి లోనై మోదీని హత్తుకుని ఆ బహుమతులను స్వీకరించారు వీటితో పాటు టెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఉపనిషత్ పుస్తకాన్ని బహుకరించారు. అమెరికా ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్‌కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని ఇచ్చారు. 






ఏంటీ సహస్ర చంద్ర దర్శనం 


ఏడాదికి 12 పౌర్ణమిలు అంటే... వెయ్యి పున్నములు చూడాలంటే దాదాపు 80 ఏళ్లు బతికి ఉండాలి. బైడెన్ వయసు ఇప్పుడు 80 ఏళ్లు. అందుకే మోదీ ఈ దానాలు చేసి ఉండొచ్చేమో అంటున్నారు పండితులు. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో వెయ్యి పౌర్ణమిలు చూసిన దంపతులకు దశదానాలు చేస్తుంటారు. మరికొందరు పెద్దల ఆత్మ శాంతికోసం ఈ దానాలు చేస్తారు. పైగా వెయ్యి పున్నములు చూసిన దంపతులన్నారంటే వారు అన్నేళ్లు అన్యోన్యంగా కలిసి ఉన్నరానేందుకు గుర్తు. మనదేశంలో 70 ఏళ్లు దాటిన సౌభాగ్యవతిని పండు ముత్తైదువ అంటారు. పండు ముత్తైదువ అంటే అమ్మవారితో సమానం. అందుకే వెయ్యి పున్నములు చూసిన దంపతులకు దానం ఇచ్చినా, తాంబూలం ఇచ్చినా, కాళ్లకు నమస్కరించినా అంతా మంచి జరుగుతుందని హిందువుల విశ్వాసం.