Decisions of Central Cabinet: సార్వత్రిక ఎన్నికల(General Elections 2024)కు ముందు కేంద్ర మంత్రి వర్గం(Central Cabinet) సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగుల(Emplyees)కు డీఏ(DA) పెంపు, యువతకు(Youth) ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI)లో శిక్షణ, పేదల మహిళలకు గ్యాస్ సిలిండెర్ల రాయితీలను ప్రకటించింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న జనపనార రైతులకు కూడా కనీసమద్దతు ధరను భారీగా పెంచింది. ఇక, మరో కీలక నిర్ణయం.. ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడం.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించేలా `ఉన్నతి-2024` పథకాన్ని కూడా మంత్రి మండలి ప్రకటించింది. ఇదిసంచలన నిర్ణయమనే చెప్పాలి. ఇక, గోవా అసెంబ్లీలో ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించే అంశానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అయితే.. ఇదిమాత్రం పార్లమెంటు నిర్ణయం మేరకు తర్వాత అమలవుతుంది. మిగిలిన నిర్ణయాలు మాత్రం తక్షణమే అమల్లోకి రానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు.. పలు వర్గాలకు ఎలా మేలు చేకూర్చనున్నాయో చూద్దాం..
ఇదీ మేలు..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు..
+ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు 4% డీఏ/డీఆర్‌ని పెంచారు. ఈ నిర్నయం ఈ ఏడాది జనవరి నుంచే అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయంతో సుమారు 49.18 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పింఛనుదారులకు రూ.12,869 కోట్ల మేరకు ప్రయోజనం కలుగనుంది. ఇప్పటి వరకు మూల వేతనంలో 46%గా ఉన్న డీఏ ప్రస్తుత 4% పెంపుతో 50శాతానికి చేరుతుంది.
+ ఉద్యోగుల ఇంటి అద్దె భత్యాన్నీ ప్రస్తుతం ఉన్న 27%, 18% 9% నుంచి వరుసగా 30%, 20%, 10%కి పెంచుతున్నారు.
+ గ్రాట్యుటీ పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. ఉద్యోగులకు లభించే వివిధ ప్రయోజనాలూ 25%మేర అదనంగా పెరగనున్నాయి.
పేద వర్గాల మహిళలకు
+ పేద కుటుంబాల్లోమహిళలకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద వంటగ్యాస్ సిలిండర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిలిండర్లపై ప్రస్తుతం ఇస్తున్న రూ.300 రాయితీని మరో ఏడాది పొడిగించారు.
+ దీనివల్ల 10.27 కోట్ల మంది లబ్ధిదారులకు ఏడాదిలో గరిష్ఠంగా 12 సిలిండర్ల వరకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది.
+ దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.12వేల కోట్ల రాయితీని ప్రకటించినట్టయింది.
రైతులు
+ జనపనార పండించే రైతులకు కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.285 మేర పెంచారు. దీంతో జూట్ కనీస మద్దతు ధర రూ.5,335కి చేరనుంది.
+ 1.65 లక్షల మంది రైతులు లబ్ధిపొందుతారు.
యువతకు..
+ దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) అభివృద్ధి, పరిశోధనల కోసం సమగ్ర వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా.. రూ.10,372 కోట్లతో ‘ఏఐ మిషన్’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
+ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ‘ఏఐ’పై యువతకు శిక్షణ, ఆవిష్కరణ కేంద్రాల ఏర్పాటు, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. తద్వారా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుంది.
ఈశాన్య రాష్ట్రాలకు..
+ ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమలను ప్రోత్సహించడానికి ‘ఉన్నతి-2024’ పేరుతో రూ.10,037 కోట్ల పథకానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
+ ఈ పథకం పదేళ్లపాటు కొనసాగుతుంది.
+ దీన్ని రెండు భాగాలుగా అమలు చేస్తారు.
+ పార్ట్-ఎ కింద ప్రోత్సాహకాల రూపంలో రూ.9,737 కోట్లు, పార్ట్-బిలో సంస్థాగత ఏర్పాట్ల కోసం రూ.300 కోట్లు ఖర్చు చేస్తారు.
+ ఈ పథకం కింద నమోదు అయిన పరిశ్రమలు తమ ఉత్పత్తిని నాలుగేళ్లలో ప్రారంభించాలి. స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి.
+ గోవా శాసనసభలో షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర మంత్రి మండలి పచ్చజెండా ఊపింది.
+ 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో ప్రస్తుతం ఎస్టీలకు రిజర్వేషన్ సీట్లు లేవు. తాజా నిర్ణయంతో 2 ఎస్టీలకు కేటాయించనున్నారు. అయితే.. దీనికి పార్లమెంటు అనుమతి తప్పనిసరి. తర్వాత.. రాష్ట్రపతి కూడా ఆమోదించాలి.