Congress MPs Candidate List: పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections)కు పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. లోక్ సభ అభ్యర్థులను ఎంపికపై దిల్లీ (delhi)లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం (Congress Party Office )లో...ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తొలిసారి సమావేశమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, శశిథరూర్, అంబికా సోనీ, సింగ్ దేవ్, తో పాటు సీఈసీ సభ్యులు పాల్గొన్నారు. జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ...వర్చువల్ విధానంలో హాజరయ్యారు.
పది రాష్ట్రాలు...60 పార్లమెంట్ స్థానాలు
దిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తెలంగాణ, లక్షద్వీప్, కేరళ, మేఘాలయ, త్రిపుర, సిక్కిం, మణిపుర్ రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ పది రాష్ట్రాల్లో 60 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వీలయినంత త్వరగాలో తొలి జాబితాను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతోంది. వివాదం లేని పార్లమెంట్ స్థానాలను ప్రకటించనుంది. తొలి జాబితాలో తెలంగాణలో 8 నుంచి 10 పార్లమెంట్ నియోజకవర్గాలకు పేర్లను ప్రకటించే అవకాశం ఉందని రాష్ట్ర నేతలు అంచనా వేస్తున్నారు. మరోవైపు అధికార బీజేపీ 195 మందితో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేసింది.
అమేథి నుంచి బరిలోకి రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ...వయ్‌నాడ్‌కు దూరమయ్యారు. హస్తం పార్టీ కంచుకోట అమేథి నుంచి బరిలోకి దిగనున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ...అమేథి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. 2019 ఎన్నికల్లో వయ్‌నాడ్‌తో పాటు అమేథి నుంచి పోటీ చేశారు. అమేథిలో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయిన ఆయన...వయ్‌నాడ్‌లో మాత్రం విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గం...కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి పెట్టని కోట. 1967లో ఏర్పాటయిన ఈ నియోజకవర్గంలో...గాంధీ కుటుంబానికి ఎదురులేదు. 1998, 2019 ఎన్నికలు మినహా...1967 నుంచి ఆ పార్టీదే విజయం. 1980లో సంజయ్ గాంధీ, 1981, 1984, 1989, 1991లో రాజీవ్ గాంధీ, 1999లో సోనియా గాంధీ ఒకసారి విజయం సాధించారు. 1991, 1996లో సతీష్ శర్మ కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. 1998లో బీజేపీ అభ్యర్థి సంజయ్ సిన్హ్ గెలుపొందారు. 1999లో సోనియా గాంధీ గెలుపొందగా....2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా మూడు పర్యాయాలు రాహుల్ గాంధీ గెలుపొందారు. తండ్రి తర్వాత అమేథిలో హ్యాట్రిక్ కొట్టిన వ్యక్తిగా రాహుల్ గాంధీ రికార్డు సృష్టించారు. అయితే 2019లో మాత్రం బీజేపీ చేతిలో ఓటమి పాలయ్యారు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంకా గాంధీ
మరోవైపు రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ నామినేట్ కావడంతో...ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. ప్రియాంకా గాంధీ...వచ్చే ఎన్నికల్లో తల్లి సోనియా గాంధీ నియోజకవర్గం రాయబరేలీ నుంచి బరిలోకి దిగనున్నారు. రాహుల్ గాంధీ అభ్యర్థిత్వాన్ని పార్టీ అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ సింగ్ పాల్ తెలిపారు. రాహుల్ గాంధీ ప్రస్తుత నియోజకవర్గం...వయ్‌నాడ్‌లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా సతీమణి అనీ రాజా పోటీ చేయనున్నారు.