Mizoram Election 2023: ఈశాన్య రాష్ట్రం మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించేందుకు బారులు తీరారు. మొత్తం 40 స్థానాలకు ఓటింగ్ జరగ్గా, మధ్యాహ్నం 3 గంటల వరకూ సుమారు 69 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 8.57 లక్షల మంది ఓటర్లు ఉండగా.. సెర్చిప్ జిల్లాలో అత్యధికంగా 77.78 శాతం ఓటింగ్ నమోదైంది.
ఈవీఎం మొరాయింపు.. రెండోసారి వచ్చిన సీఎం
మిజోరం సీఎం, మిజో నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడు జోరంథంగా తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం ఐజ్వాల్ నార్త్ - 2 నియోజకవర్గ పరిధిలోని 19 - ఐజ్వాల్ వెంగ్లాయ్ - 1 పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అయితే, అక్కడ ఈవీఎం మొరాయించడంతో కొద్దిసేపు చూసి వెనుదిరిగారు. అనంతరం 11 గంటల సమయంలో మళ్లీ పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు సైతం ఐజ్వాల్ లోని సౌత్ - 2 పోలింగ్ స్టేషన్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఓటెత్తిన చైతన్యం
మిజోరం ఎన్నికల సందర్భంగా ఓటరు చైతన్యం వెల్లవిరిసింది. ఉదయం నుంచే ఓటేసేందుకు ప్రజలు క్యూలో బారులు తీరారు. చంపాయి దక్షిణ నియోజకవర్గానికి చెందిన 101 ఏళ్ల వయసున్న పురౌలనుదల.. 86 ఏళ్ల తన భార్యతో వచ్చి ఓటు వేశారు. దీంతో అంతా ఆయన్ను అభినందించారు. అలాగే 96 ఏళ్ల దివ్యాంగుడు ఐజ్వాల్ లోని తన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు.
పోలీసుల పటిష్ట భద్రత
మిజోరంలో మొత్తం 40 స్థానాలకు ఓటింగ్ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సందర్భంగా బంగ్లాదేశ్, మయన్మార్‌తో మిజోరం సరిహద్దుల వెంబడి.. పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. మణిపుర్, అసోం, త్రిపుర రాష్ట్రాల.. సరిహద్దులను మూసివేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమన్వయంతో విజయవంతంగా పోలింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. అటు, పోలింగ్ సిబ్బంది సైతం పక్కా ప్రణాళికతో వ్యవహరించి ఓటర్లు స్వేచ్ఛగా ఓటేసేలా చర్యలు చేపట్టారు.
డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు
ఈ ఎన్నికల్లో 174 మంది అభ్యర్థుల తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేశారు.
గెలుపెవరిదో.?
అధికార మిజో నేషనల్ ఫ్రంట్.. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి పాలన సాగించాలని భావిస్తోంది. మరోవైపు.. జొరాం పీపుల్స్ మూమెంట్, బీజేపీ, కాంగ్రెస్.. అధికార పార్టీని గద్దె దించాలని ప్రయత్నిస్తున్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ 26 సీట్లు సాధించింది. కాంగ్రెస్‌కు 5, బీజేపీకి ఒక సీటు దక్కింది. ఈసారి గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉండగా, ఓటర్లు ఈవీఎంల్లో అభ్యర్థుల భవిష్యత్తును నిక్షిప్తం చేశారు. ఫలితంపై అంతా ఆసక్తితో చూస్తున్నారు.
Also Read: Air Pollution: 'పంట వ్యర్థాలు కాల్చడం హత్యతో సమానం' - వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం