Bangalore Boy At Nampally Metro Station: బెంగళూరులో అదృశ్యమైన 12 ఏళ్ల బాలుడి కథ సుఖాంతమైంది. హైదరాబాద్‌లోని నాంపల్లి మెట్రో స్టేషన్‌లో ఆ బాలుడిని ఓ ప్రయాణికుడు గుర్తించి అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వివరాలు.. ఆరో తరగతి చదువుతున్న డీన్స్ అకాడమీ స్టూడెంట్ పరిణవ్ బెంగళూరులోని వైట్ ఫీల్డ్‌లోని కోచింగ్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 11 గంటలకు అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత సాయంత్రం 3 గంటల ప్రాంతంలో యెమ్లూర్ పెట్రోల్ పంప్ వద్ద కనిపించాడు. చివరిగా ఆయన బెంగళూరులోని మెజెస్టిక్ బస్ టర్మినల్ వద్ద సాయంత్రం కనిపించాడు.
బెంగళూరులోని మెజెస్టిక్ బస్ టర్మినల్‌కు ఓ ప్రత్యేకత ఉంది. అక్కడి నుంచి కర్ణాటకలోని ప్రతి మూలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే సదుపాయం ఉంటుంది. మెజెస్టిక్ బస్ టర్మినల్ వెళ్లిన పరిణవ్ అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గాలింపు చేపట్టారు. బాలుడు కనిపించిన ఏరియాల్లోకి పోలీసులు వెళ్లినా.. అప్పటికే పరిణవ్ అక్కడి నుంచి వెళ్లిపోతున్నాడు. మూడు రోజులపాటు ఆ బాలుడి కోసం తల్లిదండ్రులు, పోలీసులు తీవ్రంగా గాలించారు.
ఫలితం లేకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు తమ కొడుకును చూసినవారు ఆచూకీ తెలియజేయాలని కోరుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంటికి తిరిగి రావాలని కొడుకును బ్రతిమిలాడుతూ మరో వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు వీడియోను విపరీతంగా షేర్ చేశారు. ఈ క్రమంలో పరిణవ్ బుధవారం హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యాడు. నాంపల్లి మెట్రో స్టేషన్‌లో ఆ బాలుడిని గుర్తించిన ఓ ప్రయాణికుడు పరిణవ్‌తో మాటలు కలిపాడు. వివరాలు పోల్చుకుని బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు.
ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు తెలిశాయి. మెజెస్టిక్ బస్ టర్మినల్ వెళ్లిన పరిణవ్ అక్కడి నుంచి మైసూరుకు వెళ్లాడు. ఆ తర్వాత చెన్నైని చుట్టేశాడు. అనంతరం హైదరాబాద్‌కు వెళ్లాడు. కోచింగ్ సెంటర్ నుంచి బయటికి వచ్చినప్పుడు పరిణవ్ వద్ద రూ. 100 ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని పార్కర్ పెన్‌లను అమ్ముకున్నాడు. ఖరీదైన ఒక్కో పార్కర్ పెన్‌కు వంద రూపాయల చొప్పున బేరం పెట్టి అమ్మేశాడు. పెన్‌లు అమ్మే ప్రయత్నం చేస్తున్నప్పటి సీసీటీవీ ఫుటేజీలు కూడా బయటికి వచ్చాయి.
ఈ సందర్భంగా పరిణవ్ తల్లిదండ్రులు ఎమోషన్ అయ్యారు. తండ్రి సుఖేష్ మట్లాడుతూ.. నెటిజన్లకు ధన్యవాదాలు తెలిపారు. తన కుమారుడిని కొనుగొనడంలో సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్‌లో తన కొడుకును గుర్తించి సమచారం ఇచ్చిన వక్తికి రుణపడి ఉంటామని అన్నారు. తన కొడుకు హైదరాబాద్‌లో దొరికినట్లు అతని తల్లి ధృవీకరించించారు. తన కొడుకు క్షేమంగా ఉన్నాడని, త్వరలోనే కొడుకును చూస్తామని కన్నీళ్లతో చెప్పింది. బుధవారం రాత్రి వారు కొడుకును కలుసుకున్నారు.