Mehul Choksi: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 13,000 కోట్ల రూపాయల కుంభకోణంలో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీపై ఉన్న రెడ్‌కార్నర్ నోటీసు ఎత్తేసింది ఇంటర్ పోల్. డేటాబేస్ నుంచి తొలగించినట్లు ఇంటర్‌పోల్ తెలిసింది.  ఫ్రాన్స్ లోని లియోన్‌లో ఉన్న ఇంటర్ పోల్ ప్రధాన కార్యాలయంలో చోక్సీ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఈ పరిణామంపై సీబీఐ మౌనం వహిస్తోంది.


ఏంటీ ఇంటర్‌పోల్


అప్పగింత, లొంగుబాటు, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన వ్యక్తిని నిర్బంధించడానికి ఇంటర్ పోల్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న అత్యున్నతస్థాయి సంస్థ. ఇందులో 195 మంది సభ్యులు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల విచారణ సంస్థలతో సంబంధాలు ఉంటుంది. కలిసి పని చేస్తుంది. అందుకే విదేశాలకు పారిపోయిన నేరస్తులను పట్టుకోవడానికి దీని సాయం తీసుకుంటారు. 2018లో చోక్సీకి ఇంటర్ పోల్ రెడ్ నోటీసు జారీ చేసింది. భారత్ నుంచి పారిపోయిన దాదాపు 10 నెలల తర్వాత ఈ నోటీసులు జారీ అయ్యాయి. అదే ఏడాది చోక్సీ ఆంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్నారు.


సీబీఐ రెడ్ నోటీసును సవాలు చేసిన చోక్సీ


తనపై రెడ్ నోటీసు జారీ చేయాలన్న సీబీఐ అభ్యర్థనను సవాలు చేస్తూ చోక్సీ ఈ కేసును రాజకీయ కుట్రగా అభివర్ణించారు. చోక్సీ తన పిటిషన్‌లో భారతదేశంలోని జైలులో పరిస్థితి, తన వ్యక్తిగత భద్రత, ఆరోగ్యం వంటి అంశాలను లేవనెత్తారు. చోక్సీ పిటిషన్ తర్వాత ఈ వ్యవహారం ఐదుగురు సభ్యుల ఇంటర్ పోల్ కమిటీ కోర్టుకు వెళ్లింది. ఈ కమిటీని కమిషన్ ఫర్ కంట్రోల్ ఫైల్స్ అంటారు. విచారణ అనంతరం రెడ్ నోటీసును కమిటీ రద్దు చేసింది.


చోక్సీ 2021 మేలో డొమినికాలో చిక్కారు


చోక్సీ 2021 మేలో ఆంటిగ్వా అండ్ బార్బుడా నుంచి అదృశ్యమయ్యారు. తరువాత అతను పొరుగున ఉన్న డొమినికాలో కనిపించారు. అక్కడ అక్రమంగా ప్రవేశించారనే అభియోగంపై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. డొమినికాలో చోక్సీ చిక్కిన వార్త బయటకు వచ్చిన తర్వాత, అతనిపై ఉన్న ఇంటర్ పోల్ రెడ్ నోటీసు ఆధారంగా అతన్ని తిరిగి తీసుకురావడానికి భారత్‌ చాలా ప్రయత్నాలు చేసింది. సిబిఐ డిఐజి శారదా రౌత్ నేతృత్వంలోని అధికారుల బృందం కూడా అక్కడికి వెళ్ళింది, అయితే అతని న్యాయవాదులు డొమినికా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫలితంగా చోక్సీని భారత్‌కు తీసుకురాలేకపోయారు. అక్కడ 51 రోజుల జైలు శిక్ష అనుభవించిన చోక్సీ 2021 జూలైలో బెయిల్పై విడుదలయ్యారు.


ఈ కుంభకోణంలో నీరవ్ మోడీతో చోక్సీ కుమ్మక్కయ్యారని ఆరోపణలు 


మెహుల్ చోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోదీ ముంబైలోని బ్రాడీ హౌస్ బ్రాంచ్ అధికారులతో కుమ్మక్కై పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.14,2011 కోట్లకుపైగా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2018 నుంచి నకిలీ లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్స్ (ఎల్ వోయూ) ద్వారా విదేశీ ఖాతాలకు నగదు బదిలీ చేశారు. ఈ కుంభకోణంలో చోక్సీ, నీరవ్ మోదీ ఇద్దరిపై సీబీఐ వేర్వేరుగా చార్జిషీట్లు దాఖలు చేసింది.