కేరళలోని మరియన్ అపరెల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ పోలీసులకు యూనిఫాంలు ఆర్డర్లను తీసుకునేది లేదని స్పష్టం చేసింది. యుద్ధం మొదలైన తొలి రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం గాజాలో జరుగుతున్న విధ్వంసం చూశాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ యజమాని థామస్ ఒలికాల్ వెల్లడించారు. గాజాలో పరిస్థితులు చక్కబడే వరకు ఇజ్రాయెల్ నుంచి కొత్త ఆర్డర్లను స్వీకరించబోమని తెలిపింది. ఇజ్రాయెల్ పై హమాస్ దాడి విచారకరమన్న ఆయన, ప్రతీకారం పేరుతో ఇజ్రాయెల్ చేస్తున్న దాడి అమానవీయమన్నారు. 2015 నుంచి ఇజ్రాయెల్ పోలీసులకు దుస్తులు తయారుచేసి సరఫరా చేస్తున్నామన్న ఆయన, ఒప్పందాలను అనుసరించి ఇప్పటికే ఉన్న ఆర్డర్ల ప్రకారం సరఫరా చేస్తామన్నారు. యుద్ధం ముగిసే ఎలాంటి ఆర్డర్లను స్వీకరించలేమని స్పష్టం చేశారు.
ప్రపంచ దేశాలకు సరఫరా
కేరళలోని కన్నూర్ జిల్లా చేనేత దుస్తుల తయారీ, జౌళీ ఉత్పత్తుల ఎగుమతులకు చాలా ప్రసిద్ధి. 2006లో ఇడుక్కి జిల్లాకు చెందిన అనే వ్యాపారి థామస్ ఒలిక్కల్ మరియన్ అపరెల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పరిశ్రమను ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ సంస్థ పలు దేశాలకు చెందిన పోలీసులు, ఆర్మీ సిబ్బంది, భద్రతా దళాలు, ఆరోగ్య సేవల సిబ్బందికి యూనిఫామ్‌లను సరఫరా చేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయెల్ పోలీసుల కోసం కూడా ప్రత్యేకంగా యూనిఫామ్‌లు ఎగుమతి చేస్తోంది. కేవలం భద్రతా దళాలకు చెందిన యూనిఫామ్‌లనే కాకుండా స్కూల్ యూనిఫామ్‌లు, సూపర్‌మార్కెట్ స్టాఫ్ యూనిఫామ్‌లు, డాక్టర్ కోర్టులు, కార్పొరేట్ యూనిఫామ్‌లను మరియన్ అపరెల్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేస్తోంది.
2015 నుంచి ఇజ్రాయెల్ ఆర్డర్లు
మరియన్ అపరెల్ సంస్థ గురించి తెలుసుకున్న ఇజ్రాయెల్ పోలీసులు 2015లో యజమాని ఒలికల్ థామస్‌ను సంప్రదించారు. తమ పోలీసుల యూనిఫామ్‌లు తయారు చేసి ఇవ్వాలని కంపెనీతో చర్చలు జరిపారు. మరియన్ అపరెల్ తయారు చేసిన మొదటి ఆర్డర్ నచ్చడంతో యూనిఫామ్‌ల కోసం భారీగా ఆర్డర్లు ఇచ్చారు. 2015 నుంచి ఏటా లక్ష యూనిఫామ్‌లను మరియన్ అపరెల్ ఇజ్రాయెల్ పోలీసులకు సరఫరా చేస్తోంది. యుద్ధం మొదలైన తర్వాత కూడా తమకు ఇజ్రాయెల్ పోలీసుల నుంచి పెద్ద ఎత్తున్న ఆర్డర్లు వచ్చాయి. ఇజ్రాయెల్ దేశానికి చెందిన పోలీసులకు యూనిఫామ్‌లు కుట్టి పంపించడం గర్వంగా ఉందన్నారు ఒలికాల్.
పరిస్థితులు చక్కబడ్డాకే కొత్త ఆర్డర్లు
మరియన్ అపరెల్ సంస్థలో పని చేసే 1500 మంది టైలర్లు, ఉద్యోగులు ఇజ్రాయెల్ పోలీసులకు ఇప్పటివరకు ఫుల్ స్లీవ్స్‌లో లైట్ బ్లూ కలర్లో ఉండే యూనిఫామ్ షర్ట్స్‌ను మాత్రమే తయారు చేశారు. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్ అధికారుల నుంచి మరో కొత్త ఉత్పత్తికి ఆర్డర్ లభించినట్లు సంస్థ యజమాని థామస్ ఒలికాల్ ఇటీవలే వెల్లడించారు. ఈ సారి వీటితో పాటు ప్రత్యేకంగా కార్గో ప్యాంట్స్‌ను కూడా తయారు చేయనున్నట్లు తెలిపారు. తొలి ఆర్డర్ డిసెంబర్ నాటికి ఎగుమతి చేస్తామని థామస్ వెల్లడించారు. ఇంతలోనే గాజాలో పరిస్థితులు దారుణంగా మారడంతో ఇజ్రాయెల్ నుంచి కొత్త ఆర్డర్లు తీసుకునేది లేదని థామస్ ఒలికాల్ వెల్లడించారు. గాజా పరిస్థితులు చక్క బడిన తర్వాత కొత్త ఆర్డర్లు తీసుకుంటామన్నారు.