Manipur Viral Video: 



సంచలనమైన వీడియో..


మణిపూర్ వైరల్‌ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్లమెంట్‌నీ కుదిపేసింది. ఇప్పటికే ఈ అమానుషానికి పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ ప్రకటించారు. ఆ తరవాత మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి నలుగురు అరెస్ట్ అయ్యారు. మహిళను వివస్త్రను చేసి లాక్కెళ్లిన వ్యక్తిని థౌబల్ జిల్లాలో గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ వీడియోపై పెద్ద ఎత్తున కలకలం రేగింది. ఎప్పుడో రెండు నెలల క్రితం ఇంత దారుణం జరిగితే...ఇన్ని రోజుల పాటు పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించాయి ప్రతిపక్షాలు. సోషల్ మీడియాలోనూ మణిపూర్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 70 రోజుల తరవాత నిందితులను అరెస్ట్ చేయడంపైనా మండి పడుతున్నారు. స్థానికులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలతో మళ్లీ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో ప్రధాన నిందితుడి ఇంటికి నిప్పంటించారు స్థానికులు. ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి మహిళలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉన్నట్టుండి నిందితుడి ఇంటి వద్దకు వచ్చి నిప్పంటించారు. ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ స్పందించారు. 


"ఆ వైరల్ వీడియో చూసిన తరవాత వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. మానవత్వానికే మచ్చ తెచ్చే దారుణమైన ఘటన ఇది. ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశాం. విచారణ కొనసాగుతోంది. చట్టప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మహిళలపై ఇలాంటి అమానుషాలకు ఇదే ముగింపు కావాలి. మహిళల్ని గౌరవించాలి"


- బైరెన్ సింగ్, మణిపూర్ ముఖ్యమంత్రి