Mallikarjun Kharge:
ఖర్గే మాట్లాడుతుండగా మైక్ ఆఫ్
రాజ్యసభలో మాట్లాడుతుండగా మల్లికార్జున్ ఖర్గే మైక్‌ని ఆఫ్ చేయడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "నా ఆత్మగౌరవాన్నే ప్రశ్నిస్తున్నారా" అంటూ మండిపడ్డారు. మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో ప్రస్తావించకపోవడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సభలు సజావుగా సాగడం లేదు. కచ్చితంగా దీనిపై చర్చ జరగాల్సిందేనని పట్టుపడుతున్నాయి విపక్షాలు. ఈ క్రమంలోనే మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతుండగా ఆయన మైక్ కట్ అయిందని ఆరోపించారు. ఖర్గే కామెంట్స్‌ని ఖండించిన బీజేపీ ఎంపీలు "మోదీ మోదీ" అనే నినాదాలతో హోరెత్తించారు. ఫలితంగా..చాలా సేపటి వరకూ సభలో గందరగోళం నెలకొంది. ఆ తరవాత సభ వాయిదా పడింది. ఎగువ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఖర్గే...తాను మాట్లాడుతుండగా మైక్ ఆఫ్ చేసి ప్రసంగాన్ని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ఇప్పటికే విపక్ష ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభల్లో మణిపూర్‌పై చర్చ జరగాలని నోటీసులిచ్చారు. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ వాయిదా తీర్మానాన్నీ ప్రవేశపెట్టారు. మణిపూర్‌పై చర్చ జరిగేంత వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆ తరవాత డీఎమ్‌కే ఎంపీ తిరుచ్చి శివ, ఆర్‌జేడీ ఎంపీ మనోజ్ ఝా కూడా రూల్ 267 ప్రకార నోటీసులిచ్చారు. కాంగ్రెస్‌కి చెందిన రంజిత్ రంజన్, రాజీవ్ శుక్లా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కూడా వాళ్లకు మద్దతుగా నిలిచారు.
ప్రధాని మోదీ INDIA కూటమిని ఉగ్రవాదులు అని విమర్శించడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు ఖర్గే. "మమ్మల్ని ఉగ్రవాదులు అని అంటూనే సభ సజావుగా సాగేందుకు సహకరించాలని హోంమంత్రి అమిత్‌షా ఎలా అడుగుతున్నారు" అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ పార్లమెంట్‌లో మణిపూర్ హింసపై మాట్లాడాలని అమిత్‌షాకి లేఖ రాశారు ఖర్గే.
మణిపూర్ హింసాకాండపై భగ్గుమన్న విపక్షాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఆందోళనలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసన తీర్మానం ప్రవేశపెట్టాయి. INDIA గా పేరు మార్చుకున్న విపక్ష కూటమి పూర్తి స్థాయిలో దీనిపై పోరాటం చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే నో కాన్ఫిడెన్స్ మోషన్‌ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, BRS ఎంపీ నామా నాగేశ్వరరావు ఈ తీర్మానాన్ని అందజేశారు. లోక్‌సభలోని కాంగ్రెస్ విప్ మాణికం ఠాగూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంపై పోరాడడానికి చివరి అస్త్రం ఇదే అని తేల్చి చెప్పారు.దీనిపై మాణికం ఠాగూర్ స్పందించారు. INDIA కూటమి ఈ విషయంలో కలిసి పోరాడుతుందని తేల్చి చెప్పారు.
"INDIA కూటమి కలిసే ఉంటుంది. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని అంతా కలిసే నిర్ణయించుకున్నాం. ప్రధాని మోదీ గర్వాన్ని అణిచివేయాలన్నదే మా ఉద్దేశం. ఆయన వైఖరి అసలు బాగోలేదు. పార్లమెంట్‌కి రావడం లేదు. మణిపూర్‌పై ఒక్క స్టేట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. అందుకే...దీన్నే మా చివరి ఆయుధంగా మార్చుకున్నాం"
- మాణికం ఠాగూర్, కాంగ్రెస్ ఎంపీ
Also Read: Byju's: కన్నీళ్లు పెట్టుకున్న బైజూస్ రవీంద్రన్, ఒకప్పుడు హీరో-ఇప్పుడు దాదాపు జీరో, ఎందుకిలా?