Manipur Violence:



చురచందపూర్‌లో పరామర్శ..


మణిపూర్‌ బాధితులను గవర్నర్ అనుసూయ ఉయ్‌కీ పరామర్శించారు. రిలీఫ్ క్యాంప్‌లలో తలదాచుకుంటున్న వారితో మాట్లాడారు. చురచంద్‌పూర్‌లోని క్యాంప్‌లలో పర్యటించారు. ఈ క్రమంలోనే ఓ మహిళ కన్నీళ్లు పెట్టుకుంది. ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తోందని వెక్కివెక్కి ఏడ్చింది. ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరింది. ఆ బాధితురాలిని చూసి భావోద్వేగానికి గురైన గవర్నర్ ఓదార్చారు. "ఏడవకండి" అని భుజం తట్టారు.


 






ఆ తరవాత మీడియాతో మాట్లాడారు అనుసూయ. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోకి తీసుకొచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. ప్రజలు కూడా తమకు సహకరించాలని కోరారు. INDIA కూటమికి చెందిన 21 మంది ఎంపీలు రాష్ట్ర పర్యటనకు రావడంపైనా స్పందించారు.  


"మణిపూర్‌లో మళ్లీ శాంతిభద్రతలు ఎప్పుడు అదుపులోకి వస్తాయని నన్ను చాలా మంది అడుగుతున్నారు. రెండు వర్గాల ప్రజలు కూర్చుని చర్చించుకునేలా చేయాలని నేను ప్రయత్నిస్తున్నాను. ఇప్పటికే ఆ వర్గాలతో మాట్లాడుతున్నాను. వాళ్లతో పాటు రాజకీయ పార్టీలూ మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వీలైనంత త్వరగా శాంతియుత వాతావరణం నెలకొల్పేలా చూడాలి"


- అనుసూయ ఉయ్‌కీ, మణిపూర్ గవర్నర్ 






కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వారిని ఓదార్చిన గవర్నర్ వారికి తగిన సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆస్తినష్టం వాటిల్లిన వాళ్లకీ పరిహారం అందజేస్తామని వెల్లడించారు. 


"ఈ అల్లర్లలో చాలా మంది తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. వాళ్లందరికీ పరిహారం అందజేస్తాం. ఆస్తినష్టం వాటిల్లిన వాళ్లకూ పరిహారం అందిస్తాం. మణిపూర్ ప్రజల భవిష్యత్‌ కోసం, ఇక్కడ శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను"


- అనుసూయ ఉయ్‌కీ, మణిపూర్ గవర్నర్