Manipur CM: శాంతించాయి అనుకున్న మణిపూర్ అల్లర్లు, ఇద్దరు విద్యార్థుల హత్యోదంతంతో మరోసారి చెలరేగాయి. మణిపూర్ వ్యాప్తంగా విద్యార్థుల హత్యపై తీవ్ర నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల హత్య తర్వాత తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో.. విద్యార్థులను చంపిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ హామీ ఇచ్చారు. విద్యార్థులను చంపిన వారిని తప్పకుండా పట్టుకుంటామని, త్వరలోనే రాష్ట్రంలో శాంతి స్థాపన జరుగుతుందని బీరేన్ సింగ్ అన్నారు.


జులైలో కిడ్నాపయిన ఇద్దరు విద్యార్థులను చంపేసిన ఫొటోలు.. సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మైతీ తెగకు చెందిన 17ఏళ్ల హిజామ్‌ లింతోయింగంబి, 20 ఏళ్ల ఫిజామ్ హెమ్‌జిత్‌ జులై నుంచి కనిపించడం లేదు. వారు కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. అయితే.. తాజాగా వీరికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇద్దరు విద్యార్థులు అటవీ ప్రాంతంలోని ఓ క్యాంపులో కూర్చుని ఉండగా.. వెనక సాయుధులు నిల్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. సాయుధుల చేతిలో తుపాకులు కూడా ఉన్నాయి. మరో ఫొటోలో ఇద్దరు విద్యార్థులు చనిపోయి పడి ఉన్నారు. హెమ్‌జిత్‌ తల నరికేసి ఉన్నారు. వీరిద్దరినీ హత్య చేసినట్టు ఫొటోల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. అభంశుభం తెలియని విద్యార్థుల హత్యతో మణిపూర్ లో మరోసారి నిరసనలు చెలరేగాయి. ఈ ఆందోళనల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 1 వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలపై మళ్లీ నిషేధం విధించింది.


విద్యార్థుల హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. గురువారం మధ్యాహ్నం ఇంఫాల్ లోని మణిపూర్ పోలీసు హెడ్ క్వార్టర్స్ లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్ (CAPF) సీనియర్ అధికారులు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు భద్రతా సిబ్బంది దురదృష్టవశాత్తు గాయపడిన, చనిపోయిన విషయాన్ని అధికారులకు వివరించారు.


మణిపూర్ సీఎం నివాసంపై దాడి


రెండ్రోజుల క్రితం మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్సింగ్ పూర్వీకుల ఇంటిపై అల్లరి మూకలు దాడి చేశాయి. అర్ధరాత్రి సమయంలో అటాక్ చేశాయి. అల్లరి మూకలు రెండు బ్యాచ్ లుగా ఏర్పడి.. రెండు వైపుల నుంచి సీఎం పూర్వీకుల ఇంటిని చుట్టుముట్టారు. దీన్ని వెంటనే గమనించిన భద్రతా బలగాలు వారిని తరిమేశాయి. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో అల్లరి మూకలు అక్కడి నుంచి పారిపోయాయి. మణిపూర్ లో అల్లర్లు మొదలైనప్పటి నుంచి ఈ ఇంట్లో సీఎం పూర్వీకులు ఎవరూ ఉండటం లేదని పోలీసు అధికారులు తెలిపారు.


అల్లరి మూకలు 150 మీటర్ల దూరంలో ఉండగానే సీఎం పూర్వీకుల ఇంటికి విద్యుత్ కనెక్షన్ నిలిపి వేసినట్లు అధికారులు వెల్లడించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, మణిపూర్ పోలీసు సిబ్బంది అనేక రౌండ్ల టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. దీంతో మూకలు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. సీఎం నివాసాన్ని అల్లరి మూకలు అవలీలగా చేరడాన్ని భద్రతా లోపం, ఇంటెలిజెన్స్ లోపంగా పరిగణించవచ్చని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. విద్యార్థుల హత్యోదంతం మరోసారి మణిపూర్ లో మంటలు రేపుతోంది.