Man Goes Close To CM Siddaramaiah With Gun In Election Rally: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) లోక్ సభ ఎన్నికల ర్యాలీలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. వాహనంపై నుంచి ఆయన ప్రజలు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి తుపాకీతో హల్ చల్ చేశాడు. వాహనంపై ఉన్న ఆయన వద్దకు నడుముకు తుపాకీ పెట్టుకుని వెళ్లిన వ్యక్తి సీఎం పక్కన ఉన్న నేతలకు పూలదండలు వేశాడు. దీంతో కార్యకర్తలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బెంగుళూరులోని (Bengaluru) విల్సన్ గార్డెన్ సమీపంలో రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె, లోక్ సభ ఎన్నికల అభ్యర్థి సౌమ్య రెడ్డి తరఫున సీఎం సిద్ధరామయ్య ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. అదే సమయంలో ప్రచార వాహనంపైకి ఎక్కిన వ్యక్తి.. మంత్రి రామలింగారెడ్డికి, సౌమ్యరెడ్డికి పూలదండలు వేశాడు. అయితే, అతని నడుము దగ్గర తుపాకీ ఉన్న విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. సదరు వ్యక్తి వాహనం దిగుతుండగా.. గన్ ను గుర్తించి.. అంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మారణాయుధం కలిగి ఉన్న వ్యక్తి సీఎంకు అత్యంత సమీపంలోకి ఎలా వెళ్లగలిగాడనే దానిపై విమర్శలు వస్తున్నాయి. 






లైసెన్సుడ్ తుపాకీ


అయితే, తుపాకీ ధరించిన వ్యక్తిని రియాజ్ గా పోలీసులు గుర్తించారు. ఆత్మరక్షణ కోసమే అతను కొన్నేళ్ల నుంచి తుపాకీని వెంట పెట్టుకుని తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో లైసెన్సుడ్ గన్స్ సైతం పోలీసులకు అప్పగించాల్సి ఉంది. అయితే, ఈ సమయంలో కూడా తుపాకీ వెంట పెట్టుకుని తిరిగేలా సదరు వ్యక్తి  పోలీసుల అనుమతి పొందినట్లు తెలుస్తోంది. గతంలో రియాజ్ పై పలు దాడులు జరిగాయని.. అప్పటి నుంచి లైసెన్సుడ్ తుపాకీకి అనుమతి పొంది తన వెంట గన్ పట్టుకుని తిరుగుతున్నాడని పోలీసులు చెప్పారు. అతనికి లైసెన్సుడ్ తుపాకీకి అనుమతి ఉందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.


బీజేపీ విమర్శలు


అటు, ఈ ఘటనపై స్పందించిన బీజేపీ (Bjp).. కాంగ్రెస్ పై (Congress) విమర్శలు గుప్పించింది. సీఎం సిద్ధరామయ్యకు పోకిరీలు, రౌడీలు పూల మాలలు వేస్తారని చూపించేందుకే ఈ ఘటన జరిగిందని దుయ్యబట్టింది. రౌడీలు ఇప్పుడు ర్యాలీల్లో సీఎం, డిప్యూటీ సీఎంలకు పూల దండలు వేసి ఫోజులిచ్చే పరిస్థితులు తలెత్తాయని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఓటర్లను భయ భ్రాంతులకు గురి చేసేందుకు తుపాకులు ఇలా ప్రదర్శిస్తున్నారని మండిపడింది. 


Also Read: Kejriwal: సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు - అరెస్టును సమర్థించిన కోర్టు, కీలక వ్యాఖ్యలు