Maharashtra Viral Video: ఎన్‌సీసీ.. నేషనల్ క్యాడెడ్ కాప్స్. ఇది విద్యార్ధి దశ నుంచే దేశంపై మమకారం పెంచుతూ కఠోర శిక్షణ ఇస్తూ వారి జీవితాలను తీర్చిదిద్దుతారు. సామాజిక సేవా, జాతీయభావం పెంపొందిస్తుంది.  అయతే  శిక్షణ పేరుతో మహారాష్ట్రలో జూనియర్‌ విద్యార్థులను సీనియర్‌ విద్యార్థి చితకబాదుతున్న వీడియో వైరల్ అవుతోంది. అందులో జూనియర్లను బురదలో వారిని పడుకోబెట్టి విచక్షణా రహితంగా ప్లాస్టిక్ పైపుతో కొడతున్నారు. దీనిపై మానవ హక్కుల సంఘాలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జంతువులను కొట్టినట్లు కొట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 


మహారాష్ట్ర థానేలోని జోషి బేడేకర్ కళాశాలలో ఎన్‌సీసీ శిక్షణ కొనసాగుతోంది. ఇక్కడ బండోద్కర్, బేడేకర్, పాలిటెక్నిక్ ఇలా మూడు విభాగాల విద్యార్థులకు ఉమ్మడి ఎన్‌సీసీ శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ సమయంలో విద్యార్థులకు సైన్యం, నేవీ శిక్షణకు ముందు పాఠాలు చెబుతారు. ఈ శిక్షణ సమయంలో విద్యార్థులు ఏదైనా తప్పు చేస్తే శిక్షిస్తారు. అయితే అక్కడ జరుగుతున్న దారుమైన వీడియో వైరల్ అవుతోంది. 


ఇందులో ట్రైనర్‌నన్న నెపంతో ఓ సీనియర్ ఎన్‌సీసీ క్యాడెట్  ఎనిమిది మంది జూనియర్లను శిక్షణ నెపంతో చితకబాదాడు. తాను చెప్పినట్లుగా జూనియర్లు చేయలేదని కసితో ఊగిపోయాడు. తానంటే ఏంటో చూపిస్తానంటూ జంతువులను కొట్టినట్లు లావుపాటి ప్లాస్టిక్ పైపులతో విచక్షణా రహితంగా కొట్టాడు. తన ప్రతాపం చూపించాడు. 


జోరుగా వర్షం కురుస్తున్న సమయంలో పుష్-అప్ పొజిషన్ చేయమని ఆదేశించాడు. ఆపై పైపుతో విచక్షణారహితంగా దాడి చేయడం మొదలు పెట్టాడు. జూనియర్ విద్యార్థులు బాధతో అరిచినా సీనియర్ వదలకుండా కొడుతూనే ఉన్నాడు. నొప్పి భరించలేక పడిపోయిన విద్యార్థులను కాళ్లతో తన్నాడు. నొప్పి భరించలేక బాధడుతున్న వారిని శారీరకంగా హింసించడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఈ ఘటనను చాలా మంది ఖండించారు. శిక్షణ పేరుతో ఇలా చేయడం శిక్షార్హమని తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ వీడియో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కలకలం రేపింది.






ట్రైనింగ్ పేరుతో జూనియర్లను చితకబాదుతున్నా అక్కడ చూస్తున్న మరి కొందరు సీనియర్లు కనీసం స్పందించలేదు. ఆ వీడియో చూసిన ఎవరికైనా రక్తం సలసలా మరుగుతుంది. గొడ్డును కూడా ఇంత దారుణంగా ఎవరూ కొట్టరు. క్రమశిక్షణ పేరుతో జూనియర్లను ప్లాస్టిక్ పైప్‌తో ఇష్టం వచ్చినట్లుగా కొట్టేశాడు. ఈ దారుణం ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు కానీ తాజాగా వీడియో వైరల్ అవడంతో అసలు విషయం బయటపడింది. సీనియర్ల పేరుతో జూనియర్లపై జరుగుతున్న దాడి వెలుగులోకి వచ్చింది.   


వీడియోపై జోషి బేడేకర్ కాలేజీ ప్రిన్సిపాల్ సుచిత్రా నాయక్ స్పందించారు. ఇలాంటి ఘటనలను సహించబోమన్నారు. అదే సమయంలో ఇలాంటివి పునరావృతం కాకుండా తక్షణమే కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు విద్యార్థులు తమను కలవాలని సూచించారు. ఎన్‌సీసీని వదిలిపెట్టే ఆలోచన కూడా చేయవద్దని నాయక్ అన్నారు. గత 40 ఏళ్లుగా తమ కాలేజీలో శిక్షణ ఇస్తున్నట్లుగా తెలిపారు. అధ్యాపకులు గైర్హాజరైన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ప్రిన్సిపల్ తెలిపారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial