Maharashtra NCP Crisis:



శిందే పదవికి ఎసరు..?


అజిత్ పవార్ తిరుగుబాటుపై NCP తీవ్రంగా స్పందిస్తోంది. తమది ఇకపై ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అని సీఎం ఏక్‌నాథ్ శిందే చెబుతున్నా...NCP నేతలు మాత్రం కొట్టి పారేస్తున్నారు. పైగా...అజిత్ పవార్ తిరుగుబాటుతో శిందేకే ముప్పు అని తేల్చి చెబుతున్నారు. ఆయన పదవే ప్రమాదంలో పడిపోతుందని, ఇది ఆయనకు అర్థం కావడం లేదని సెటైర్లు వేశారు. త్వరలోనే శిందే అధికారాలన్నీ తగ్గిపోతాయని, క్రమంగా అవి అజిత్ పవార్‌ చేతుల్లోకి వెళ్లిపోతాయని జోస్యం చెబుతున్నారు. అంతే కాదు. బీజేపీలో కొందరు నేతలు...శిందే పని తీరుపై అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఎలాగైనా సైడ్ చేయాలన్న ప్లాన్‌తో అజిత్‌ పవార్‌ని రంగంలోకి దింపారని అంటున్నారు. మరి వీళ్లు చెబుతున్నట్టుగానే...మెల్లగా శిందేని పక్కకి నెట్టేస్తారా అన్నది వేచి చూడాల్సిందే. ఏదేమైనా అజిత్ పవార్ రాకతో బీజేపీకి కలిసి రానుంది. ఇప్పటికే 125 మంది ఎమ్మెల్యేలతో స్ట్రాంగ్‌గా ఉంది ఆ పార్టీ. ఎప్పుడైతే ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం కుప్ప కూలిందో అప్పుడే శిందేకి సపోర్ట్ చేసి ఆయనకు సీఎం పదవినిచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ప్రతిపక్షం అనేదే లేకుండా పూర్తిగా కూల్చి వేయాలని ప్లాన్ చేసుకుంది. రెండో ప్లాన్‌లో భాగంగా అజిత్ పవార్‌ని లాగేసింది. అయితే..శిందే వర్గంలోని కొందరి మంత్రుల పనితీరుపై బీజేపీ అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ గ్రూప్‌లోని 10 మంది మంత్రులను పక్కన పెట్టి NCP నుంచి వచ్చిన వారికి ఆ అవకాశం కల్పించాలని భావిస్తోంది. 


అమిత్ షా మంతనాలు..


అజిత్ పవార్‌ని ప్రభుత్వంలోకి ఆహ్వానిస్తే వెంటనే పార్టీ విడిచి పెట్టి వెళ్లిపోతామని శిందే వర్గంలోని కొందరు కీలక నేతలు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. అయితే...కేంద్రమంత్రి అమిత్‌షా జోక్యంతో వాళ్లు కాస్త చల్లబడ్డారని తెలుస్తోంది. గత వారమే ఢిల్లీ అజిత్‌ పవార్‌తో పాటు ఏక్‌నాథ్ శిందేతోనూ భేటీ అయ్యారు షా. అయితే..ఇప్పటి వరకూ బీజేపీ నేతలు దీనిపై కామెంట్ చేయలేదు. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందేంటంటే..ఇదంతా రాహుల్‌కి కౌంటర్ ఇచ్చేందుకేనట. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు. పైగా...ప్రతిపక్ష నేతగానూ ఆయననే ఎన్నుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. అందుకే...ఆ పార్టీని ఇరకాటంలో పెట్టాలన్న ఉద్దేశంతో NCPని బీజేపీ టార్గెట్ చేసినట్టు సమాచారం. కూటమిలోని ప్రధాన పార్టీలను పక్కకు తప్పిస్తే కాంగ్రెస్ బలం తగ్గిపోతుందని BJP భావించినట్టు తెలుస్తోంది. ఇది ఊహించని మలుపు అందరూ అనుకుంటున్నప్పటికీ...దాదాపు ఏడాదిగా సీక్రెట్‌గా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. శిందేతో పాటు బీజేపీతోనూ అనేక చర్చల తరవాత పక్కా ప్లాన్ ప్రకారం...అజిత్ పవార్ NCP నుంచి బయటకు వచ్చేశారు. శిందే ప్రభుత్వంలో చేరి డిప్యుటీ సీఎం బాధ్యతలు చేపట్టారు. ఆయనతో సహా మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్లంతా NCPలో కీలక నేతలే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ కూడా తిరుగుబాటు చేసిన వాళ్లలో ఉన్నారు. 


Also Read: రాజకీయ పార్టీలకు ఈసీ షాక్, ఎన్నికల లెక్క తేల్చేందుకు స్పెషల్ వెబ్‌పోర్టల్