Maharashtra Clash: మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో బుధవారం నాడు ఘర్షణలు చెలరేగాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో వచ్చిన ఓ వివాదాస్పద పోస్టు తర్వాత ఈ ఘర్షణలు చెలరేగినట్లు అధికారులు చెబుతున్నారు. గొడవలను ఆపేందుకు పోలీసులు లాఠీఛార్జీ జరిపారు. కొల్హాపూర్ లో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆర్ఏఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. సోషల్ మీడియోలో ఓ వర్గానికి సంబంధించిన పోస్టు వైరల్ కావడంతో మరో వర్గం వారు కొల్హాపూర్ టౌన్ బంద్ కు పిలుపునిచ్చారు. 

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ను ప్రస్తుతిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వచ్చింది. ఇదే ప్రస్తుతం ఘర్షణలకు కారణమైంది. ఔరంగజేబ్, టిప్పు సుల్తాన్ పోస్టర్లతో కొందరు వేడుకలు చేసుకున్నట్లు ఆ సోషల్ మీడియా పోస్టులో కనిపించింది. దీంతో పెద్ద సంఖ్యలో మరో వర్గం వారు శివాజీ చౌక్ వద్ద సమావేశం అయ్యారు. అనంతరం కొల్హాపూర్ టౌన్ బంద్ కు పిలుపునిచ్చారు. ఆ కొద్దిసేపటికే ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇరు వర్గాల గొడవలతో కాసేపట్లోనే అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జీ జరిపి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. 

కొంతమందితో కూడిన గుంపులు భద్రతా బలగాలపై దాడి చేశాయి. రాళ్లు రువ్వారు, కొన్ని వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు స్థానిక దుకాణాలను బలవంతంగా మూసేయించారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేశారు.  తర్వాత నిరసనలు చేసిన, ఘర్షణలకు పాల్పడిన ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతలను కాపాడాలని, నిరసనలు విరమించాలని ఆందోళనకారులను స్థానిక ఎస్పీ విజ్ఞప్తి చేశారు. 

'ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, ఆందోళనకు దిగొద్దు'

కొల్హాపూర్ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పాల్సిన బాధ్యత తమ ప్రభుత్వానికి ఉందని, ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని కోరారు. ఎలాంటి ఆందోళనకు దిగవద్దని విజ్ఞప్తి చేశారు. పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జనాలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన వారిని గుర్తించేందుకు సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. ఇలాంటి చర్యలను ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని ఉప ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఒక వర్గానికి చెందిన వారు ఔరంగజేబ్ ను ప్రస్తుతిస్తూ పోస్టులు పెట్టారన్నారు. ఇలాంటి వాటిని సహించేది లేదని స్పష్టం చేశారు. పలు జిల్లాల్లోనూ ఔరంగజేబ్ ను ప్రస్తుతిస్తూ పలు ఘటనలు వెలుగుచూశాయని, ఇవి అకస్మాత్తుగా జరిగినవి కావని ఫడ్నవీస్ అన్నారు.