మధ్యప్రదేశ్‌లో ఒక తండ్రి చేసిన పని విపరీతమైన విమర్శలకు దారి తీస్తోంది. ముఖ్యమంత్రి మెప్పు పొందడం కోసం అతను కన్న కొడుకునే విసిరేశాడు. ఆ పిల్లాడికి ఏడాది వయసు, పైగా అనారోగ్యంతో ఉన్నాడు. కనికరం లేకుండా సొంత కొడుకునే ఇలా విసిరేసినందుకు సామాజిక మాధ్యమాల్లో సైతం జనాల నుంచి తిట్లను ఎదుర్కొంటున్నాడు.


మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బహిరంగ సభ జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఆ సభకు వచ్చారు. ముకేశ్ పాటేల్ అనే వ్యక్తి ఓ దినసరి కూలీ. అతను కూడా ముఖ్యమంత్రి సభకు భార్య నేహ, ఏడాది వయసు కుమారుడు నరేశ్ తో కలిసి ముఖ్యమంత్రి సభకు వచ్చాడు. అంత మందిలో ముఖ్యమంత్రి కన్ను తనపై పడేందుకు తన కుమారుణ్ని ఏకంగా విసిరేశాడు. 


అయితే, తాను ఎందుకు విసిరేశానో పటేల్ స్థానిక మీడియాకు తెలిపాడు. తన కుమారుడు నరేశ్ కు గుండెలో చిల్లు ఉందని, అందుకు వైద్యం చేయించానికి అయ్యే ఖర్చు భరించే స్తోమత తనకు లేదని వాపోయాడు. అందుకే ముఖ్యమంత్రికి ఆ విషయం తెలియాలనే ఉద్దేశంతో తనకు ఇష్టం లేకపోయినా తన కొడుకుని వేదికపైకి సున్నితంగా విసిరేసినట్లుగా చెప్పాడు. అయితే, చిన్నారి బాలుడ్ని వేదికపైకి విసిరివేయడం చూసి దిగ్భ్రాంతికి లోనైన భద్రతా సిబ్బంది ఏడుస్తున్న ఆ బిడ్డను ఎత్తుకుని అతని తల్లికి అప్పగించారు.


ఈ విషయం అక్కడే ఉన్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చూడడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. తన వెంట ఉన్న అధికారుల ద్వారా అన్ని వివరాలు తెలుసుకున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి అధికారులు సీఎంకు వివరించారు. దీంతో ఆ బాలుడికి అన్ని విధాలుగా ఆరోగ్యపరంగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు బాలుడి ఆరోగ్యానికి సంబంధించిన వివరాల నివేదికను పంపాల్సిందిగా కలెక్టర్ ను ఆదేశించారు. 


ఈ ఘటనపై పటేల్ మాట్లాడుతూ.. తాను సహజ్ పూర్ గ్రామంలో నివసిస్తుంటానని చెప్పాడు. తన కుమారుడికి గుండెలో రంద్రం ఉందనే సంగతి అతనికి 3 నెలల వయసు ఉన్నప్పుడే తెలిసిందని చెప్పారు. అప్పటి నుంచి తనకు అంత స్తోమత లేకపోయినా బాబు వైద్యం కోసం 4 లక్షలు ఖర్చు చేసినట్లుగా చెప్పారు.