Shivraj Singh Chouhan:



ఇంటికి పిలిచి మరీ క్షమాపణలు..


మధ్యప్రదేశ్‌లో ఆదివాసీపై ఓ వ్యక్తి యూరినేట్ చేసిన వీడియో వైరల్ అవడమే కాకుండా రాజకీయాల్నీ వేడెక్కించింది. ఆ నిందితుడుని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. వెంటమనే అప్రమత్తమైన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం...ఆ నిందితుడుని అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మెడికల్ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్..బాధితుడిని కలిశారు. భోపాల్‌లోని తన నివాసానికి స్వయంగా ఆహ్వానించారు. అంతే కాదు. వచ్చీ రాగానే ఆయనను కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లు కడిగారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. "ఆ వీడియో చూసి నాకు చాలా బాధగా అనిపించింది. నన్ను క్షమించండి. ప్రజలే నాకు దేవుళ్లతో సమానం" అని బాధితుడితో చెప్పారు శివరాజ్ సింగ్ చౌహాన్. కాళ్లు కడిగిన తరవాత ఆయనకు పూల మాల వేసి గౌరవించారు. ఆ తరవాత శాలువా కప్పారు. చాలా సేపు పక్కనే కూర్చుని మాట్లాడారు. ఇలా జరిగినందుకు క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఆదివాసీలపై బీజేపీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఇదే అంటూ చురకలు అంటించింది. విమర్శలు ఎక్కువవడం వల్ల పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేయడమే కాకుండా ఇంటిని కూడా కూల్చేశారు. బుల్‌డోజర్‌తో పూర్తిగా ధ్వంసం చేశారు. అది అక్రమ నిర్మాణమని వివరణ ఇచ్చారు.